వచ్చే జనవరిలోనే పాకిస్థాన్‌ సాధారణ ఎన్నికలు

పొరుగు దేశం పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు పాకిస్థాన్‌ ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది.
2024 జనవరి చివరి వారంలో పాక్‌ సాధారణ ఎన్నికలు జరగనున్నట్లు పాకిస్థాన్‌ ఎలక్షన్‌ కమిషన్‌ వెల్లడించింది.  ఈ మేరకు ఈసీపీ నియోజకవర్గాల విభజనను సమీక్షించి, సెప్టెంబర్‌ 27వ తేదీన తొలి జాబితాను విడుదల చేయనుంది.
ప్రాథమిక జాబితాపై అభ్యంతరాల తర్వాత ఎన్నికల సంఘం నవంబర్‌ 30న తుది జాబితా విడుదల చేస్తుంది. ఆ తర్వాత 54 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతిస్తుంది. ఇక జనవరి చివరి వారంలో ఎన్నికలు నిర్వహించనుంది.పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కూటమి ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్‌ పార్లమెంట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలం ఆగస్టు 12న అర్ధరాత్రితో ముగియనుండగా అంతకు ముందే ఆగస్టు 9వ తేదీనే పార్లమెంట్‌ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీకి అప్పటి ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పంపారు.  దీంతో ఆయన ఆమోద ముద్రతో పాక్‌ పార్లమెంట్‌ రద్దయింది.
పాక్ రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీని రద్దు చేస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్‌ ఎలక్షన్‌ కమిషన్‌ తాజాగా ప్రకటించింది.