వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇటీవల ఢిల్లీలో జీ 20 సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో ఈ విషయమై బైడెన్‌తో ప్రధాని మోదీ మాట్లాడారని మన దేశంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి బుధవారం వెల్లడించారు.
క్వాడ్ శిఖరాగ్ర సదస్సు కూడా అదే సమయంలో భారత్‌లో జరుగుతుందా అని విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని గార్సెట్టి బదులిచ్చారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ సదస్సుకు వచ్చే ఏడాది మన దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ నేతలను ముఖ్య అతిథులుగా మనదేశం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఆహ్వానాన్ని జో బైడెన్ అంగీకరిస్తే మన గణతంత్ర ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రెండో అమెరికా అధ్యక్షుడిగా నిలుస్తారు. 2015లో అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

More Stories
కులం, సంపద, భాష ఆధారంగా ప్రజలను అంచనా వేయవద్దు
శ్రీరాముని ఆదర్శంగానే ఆపరేషన్ సిందూర్
చిచ్చు రేపిన సల్మాన్ ఖాన్ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’