హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, లవ్లీనా బోర్గోహైన్‌లకు అరుదైన గౌరవం

హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, లవ్లీనా బోర్గోహైన్‌లకు అరుదైన గౌరవం
భారత పురుషుల హాకీజట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన మహిళా బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌లకు అరుదైన గౌరవం దక్కింది. 23నుంచి చైనా వేదికగా జరిగే ఆసియా క్రీడల ప్రారంభోత్సవాల్లో భారత బృందానికి ముందు వీరు త్రివర్ణ పతకాన్ని చేబూని నడవనున్నారు. 
 
ఈమేరకు భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌(ఐఓఏ) బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక భారత బృందానికి చెఫ్‌-డి-మిషన్‌ భూపేందర్‌ సింగ్‌ బజ్వా కంటింజెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం బజ్వా భారత రెజ్లింగ్‌ అసోసియేషన్‌ తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఆయనతోపాటు మరో నలుగురు సభ్యులు ఆయనకు సహాయకులుగా ఐఓఏ నియమించింంది. 
 
లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌ మహిళల బాక్సింగ్‌ 69కిలోల విభాగంలో కాంస్య పతకంతోపాటు న్యూఢిల్లీ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ 75కిలోల విభాగంలో స్వర్ణ పతకంతో సత్తా చాటింది. ఇక హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి 40ఏళ్ల తర్వాత హాకీ క్రీడాంశంలో ఓ పతకాన్ని ఖాయం చేశాడు. 
 
భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధిస్తే 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించనుంది. జకార్తా వేదికగా జరిగిన 2018 ఆసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా సారథ్యం వహించారు. ఈసారి ఆసియా క్రీడల్లో భారత్‌ తరఫునుంచి మొత్తం 655మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. గత ఆసియా క్రీడలతో పోల్చిచూస్తే.. భారత్‌ తరఫున ఇంతమంది ఈ పోటీల్లో పాల్గొనడం ఇదే ప్రథమం.
 
పురుషుల వాలీబాల్‌ జట్టు గ్రూప్‌-సిలో సంచలనం నమోదు చేసింది. ఆసియా క్రీడల్లో మూడుసార్లు స్వర్ణ పతకం సాధించిన దక్షిణ కొరియాపై 3-2తో సంచలన విజయం సాధించింది. తొలిరోజు కంబోడియాపై 3-0తో నెగ్గిన భారత్‌.. రెండో లీగ్‌ మ్యాచ్‌లో పటిష్ట దక్షిణ కొరియాకు ఝలక్‌ ఇచ్చి నాకౌట్‌కు చేరింది. బుధవారం జరిగిన హోరాహోరీ పోరులో భారత్‌ 25-27, 29-27, 25-22, 20-25, 17-15తో విజయం సాధించింది.