ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాట్సాప్ చానెల్ లో మంగళవారం చేరారు. ఇది వాట్సాప్ లో తాజాగా ప్రారంభమైన ఫీచర్. ఇది ఒక రకంగా వన్ వే బ్రాడ్ కాస్టింగ్ చానల్. దీని ద్వారా ఒకే సమయంలో ఎక్కువ మంది సబ్ స్క్రైబర్స్ తో కనెక్ట్ కావచ్చు. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చాలా క్రియాశీలంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్విటర్ లో ఆయన చాలా ప్రఖ్యాతి వహించారు.
ట్విటర్ సహా అనేక సోషల్ మీడియా అకౌంట్లలో రికార్డు స్థాయిలో ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఆయన వాట్సాప్ చానల్స్ లోనూ చేరారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికల లోనూ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకునే ఆలోచనలో బీజేపీ ఉంది.
అందులో భాగంగానే ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో ఉన్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని వీలైన అన్ని సోషల్ మీడియా చానల్స్ ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలనుకుంటోంది. వాట్సాప్ చానల్ ఒక రకంగా వన్ వే బ్రాడ్ కాస్ట్ టూల్ . దీని ద్వారా ఎక్కువ మందికి చేరే విధంగా టెక్ట్స్, ఫొటోస్, వీడియోస్, స్టికర్స్ పంపించవచ్చు. ఒపీనియన్ పోల్స్ వంటి వాటిని నిర్వహించవచ్చు.
వాట్సాప్ లో ఈ ఫీచర్ అప్ డేట్స్ ట్యాబ్ లో కనిపిస్తుంది. అప్ డేట్స్ లో మీరు ఫాలో కావాలనుకునే చానల్స్ ను, స్టేటస్ లను ఫాలో కావచ్చు. ఏ చానల్స్ ఫాలో కావాలనే సూచనలు కూడా వాట్సాప్ ఇస్తుంది. యాక్టివ్ గా ఉన్న చానల్స్, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న చానల్స్ ను మీకు చూపుతుంది. ఆయా చానల్స్ లో మీకు నచ్చిన పోస్ట్ లను ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. షేర్ లేదా ఫార్వర్డ్ చేయడానికి వీలుగా లింక్ కూడా కనిపిస్తుంది.
మోదీ వాట్సాప్ చానల్ లో చేరడం ఎలా?
ప్రధాని మోదీ తాజాగా ప్రారంభించిన వాట్సాప్ చానల్ లో చేరడానికి ముందుగా..
- మీ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయాలి.
- అప్ డేట్స్ ట్యాబ్ ను ఓపెన్ చేయాలి.
- ఫైండ్ చానల్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- నరేంద్ర మోదీ చానల్ కోసం సెర్చ్ చేయాలి.
- మీకు ప్రధాని మోదీకి చెందిన వాట్సాప్ చానల్ కనిపిస్తుంది.
- ఆ చానల్ కు సబ్ స్క్రైబ్ చేసి, ఫాలో కావచ్చు.

More Stories
నరేగా చట్టం రద్దు!.. పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపు
జస్టిస్ యశ్వంత్ వర్మకు ఆరు వరాల గడువు
బిజెపిని మరింతగా బలోపేతం చేస్తా.. నితిన్ నబిన్