భారత్ – కెనాడాల మధ్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ ఉగ్రవాదం

భారత్ – కెనాడాల మధ్య చిచ్చు పెట్టిన ఖలిస్థానీ ఉగ్రవాదం
భారత్, కెనడా మధ్య ఖలీస్థానీ వాదం చిచ్చు తీవ్రతరం అయింది. కెనడా, భారత్ లు పరస్పరం దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించాయి. కెనడాలో ఖలీస్థానీ నేత హత్య వెనుక భారతదేశ హస్తం ఉందని కెనడా ప్రధాని తమ పార్లమెంట్ లో ఆరోపించడంతో  రెండు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
కెనడా రాజకీయ నేతలు తరచూ అక్కడి ఖలీస్థానీ నేతల పట్ల సానుభూతి వ్యక్తం చేయడంతో పరిస్థితి దిగజారిందని భారత దేశం మండిపడుతున్నది. ఇటువంటి వైఖరితోనే కెనడాలో పలు అక్రమ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావేర్పడిందని, హత్యలు, అక్రమ మానవ రవాణా, వ్యవస్థీకృత నేరాలు జరుగుతున్నాయని విమర్శలు చెలరేగుతున్నాయి. ఇటువంటి కార్యకలాపాలకు భారత ప్రభుత్వంపై నిందలకు దిగడం దుశ్చర్య అవుతుందని భారత్ స్పష్టం చేసింది.
 
కెనడాలో దాదాపు 70 లక్షల మంది వరకూ సిక్కులు ఉన్నారు. అయితే ఖలీస్థానీవాదానికి పలు గురుద్వారాలు నిలయాలు అయ్యాయని, భారతదేశానికి చెందిన పలు హిందూ దేవాలయాలపై ఖలీస్థానీవాదులు దాడులకు దిగుతున్నారనే సమాచారంతో పలు దఫాలుగా భారతదేశం కెనడా ప్రభుత్వానికి దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ వచ్చింది.

అయితే, ఖలీస్థానీల పట్ల కెనడా ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగలేకపోవడం, నేతలు బహిరంగంగానే ఖలీస్థానీవాదులకు మద్దతు ప్రకటించడం భారత్ – కెనాడాల మధ్య సంబంధాలలో సంక్లిష్ట పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య విద్యాకార్యకలాపాలపై ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపుతుంది.

కనీసం 9 ఖలిస్తాని వేర్పాటువాద ముఠాలు కెనడా కేంద్రంగా భారత్ లో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాయి.  ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సిద్దు మూసేవాలా సహా పలువురు హత్యలకు కారకులైన వారు కెనడాలో ఆశర్యం పొందుతున్నారు. వారిని భారత్ కు అప్పచెప్పాలని మన విదేశాంగశాఖ కోరుతున్నా కెనడా ప్రభుత్వం స్పందించడం లేదు.

కొంతకాలంగా అమెరికాలో ఉద్యోగావకాశాలలో ఇబ్బందులు ఎదురొంటున్న భారతీయ సాంకేతిక నిపుణులు ఇప్పుడు కెనడా ప్రభుత్వపు సానుకూల ధోరణి ఆకట్టుకొంటున్నది. విశేషంగా భారతీయ  యువత ఉద్యోగాలు, చదువుల కోసం కెనడా వైపు చూస్తున్నారు. మరోవంక, రెండు దేశాలు వాణజ్య ఒప్పందాల పట్ల కూడా ద్రుష్టి సారిస్తున్నాయి. 

ఈ మధ్యకాలంలో అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో భారతీయ విద్యార్థులు, ఐటి యువత ఎక్కువగా కెనడాకు వెళ్లుతున్నారు. వీసాల నిబంధనలు సరళీకృతంగా ఉండటంతో కెనడానే కార్యస్థలిగా ఎంచుకుంటున్నారు. అక్కడ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలతో పాటు ఉంటున్న పలు భారతీయ కుటుంబాలు ఇప్పుడు ఎప్పుడు ఏమమవుతుందో అనే ఆందోళనలో పడ్డాయి.

కాగా కెనడా- భారత్ దేశాల మధ్య చిరకాలంగానే విద్యాపరంగా బలీయ సంబంధాలు ఉన్నాయి. ఇరుదేశాల మధ్య దాదాపు 200 విద్యాసంస్థలలో పరస్పర భాగస్వామ్యం ఉంది. ఇది కాకుండా కెనడాలో 3.18 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యాసంస్థల్లో చదువుతున్నారు. కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులలో అత్యధికం భారతీయులే ఉన్నారు. 

విదేశీ విద్యార్థులలో 20 శాతం వరకూ భారతీయ విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. కొన్నేళ్లుగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. 2022- 23 నాటికి 8.16 బిలియన్ డాలర్ల మేర ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు అయింది. భారత్ నుంచి కెనడాకు ఔషధాలు, రత్నాలు, ఆభరణాలు , టెక్స్‌టైల్స్ ఎగుమతి అవుతాయి.  కెనడా నుంచి భారతదేశానికి పప్పులు, కలప, కాగితం, మైనింగ్ ఉత్పత్తులు వస్తాయి.

విశేష రీతిలో ఇరుదేశాలు ఎప్పుడు కూడా ఏక వస్తువుల తయారీకి దిగకుండా అంతర్జాతీయ స్థాయిలో తమ ఉత్పత్తుల మధ్య పోటీ లేకుండా చూసుకుంటూ వస్తున్నాయి.  అయితే ఇటీవలి పరిణామాలతో ఈ విద్యా వ్యాపార వాణిజ్య రంగాల విషయంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టే పరిస్థితి ఏర్పడిందని వెల్లడైంది. ఇప్పటికైనా దీనిని సరిదిద్దే దిశలో చర్యలు తీసుకోకపోతే పరిణామాలు మరింత తీవ్రం అవుతాయనే భయాందోళనలు నెలకొన్నాయి.

పలువురు భారతీయ ఐటి యువత కెనడాకు వెళ్లి స్థిరనివాసం దిశలో ఉంది. ఓ అంచనా ప్రకారం కెనడాలో ఐటి పరిశ్రమకు సంబంధించి అత్యధికంగా విదేశీ ఉద్యోగులలో భారతీయులే ఉన్నారు. ఎప్రిల్ 222 నుంచి ఈ ఏడాది మార్చి వరకూ దాదాపు 15వేల మంది వరకూ భారతీయ ఐటి యువత అక్కడికి వెళ్లినట్లు టెక్నాలజీ కౌన్సిల్ సర్వేలో వెల్లడైంది. 

ఇక పలుస్థాయిల్లో కెనడాకు ఉద్యోగాలపై వసల వెళ్లిన వారి సంఖ్య 2020 నుంచి మూడింతలు అయింది. 2022లో 118,095 మంది భారతీయులు కెనడాలో శాశ్వత నివాసం ఏర్పర్చుకున్నారని వెల్లడైంది. ఈ పరిణామంతో కెనడాలో ఇప్పుడున్న భారతీయ వలసదార్ల సంఖ్య దాదాపు రెండు మిలియన్లు చేరి ఉంటుంది. దౌత్య సంబంధాలు బెడిసికొట్టిన దశలో కెనడాలో భారతీయుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నగా మారింది.