ఎడిటర్స్‌ గిల్డ్‌ పై మణిపూర్ హైకోర్టులో మొయితీలు

ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ) నివేదికను కొట్టివేయాలంటూ మొయితీ కమ్యూనిటీ మణిపూర్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసింది. రాష్ట్రంలో ఘర్షణలను పరిశీలించే అధికార బృందం లేదా ఏజన్సీ ఈ నివేదికను పరిశీలించకుండా ఆదేశించాలని పిల్‌లో పేర్కొంది. 

నార్కో ఉగ్రవాద బృందం, ఇజిఐకి మధ్య సంబంధాలు ఉన్నాయని ఇంటర్నేషనల్‌ మొయితీ ఫోరమ్‌ (ఐఎంఎఫ్‌) ఆరోపించింది. యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఎం.వి. మురళీధరన్‌, జస్టిస్‌ ఎ.బిమోల్‌ సింగ్‌లతో కూడిన ద్విసభ్యధర్మాసనం గురువారం ఈపిల్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 

తదుపరి విచారణను అక్టోబర్‌ 12కి వాయిదా వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ నోటీసులను ఆమోదించినప్పటికీ ఇజిఐ, దాని సభ్యులకు వారి స్పందన తెలిపేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.  రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం గురించి భారత సైన్యం నుండి వచ్చిన ఫిర్యాదును పరిశీలించడానికి ఒక బృందాన్ని పంపిన తర్వాత ఈ నివేదికను సెప్టెంబర్‌ 2న ఇజిఐ ప్రచురించింది.

అక్కడి మీడియా పూర్తిగా పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని ఆ నివేదికలో పేర్కొంది. అయితే ఈ నివేదికపై ఓ సామాజిక కార్యకర్త, మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌. బీరేన్‌ సింగ్‌ ఫిర్యాదుల మేరకు పోలీస్‌ స్టేషన్‌లో ఇజిఐపై ఎప్‌ఐఆర్‌ కూడా నమోదైంది. ఈ ఎఫ్‌ఐఆర్‌పై ఎడిటర్స్‌ గిల్డ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.