వరద బీభత్సానికి లిబియాలో 3000 వేలమంది మృతి

వరద బీభత్సానికి లిబియా దేశం అతలాకుతలమైంది. భారీ వర్షాలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వరదల కారణంగా ఆ దేశంలో ఇప్పటికే 3వేల మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. అంతేకాకుండా మరో ఐదారు వేల మంది గల్లంతయ్యారని వెల్లడించారు. లిబియాలోని డేర్నా నగరంలో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి.

ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. డెర్నా ప్రాంతానికి ఎగువన ఉన్న ఆనకట్టలు కూలిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. నగరంలో అనేక చెట్లు కూలిపోయాయి. విద్యుత్​ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.

వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లిబియా దేశం రెండుగా చీలిపోయి చాలా కాలం గడిచిపోయింది.  ప్రజాసేవకు సంబంధించిన కార్యక్రమాలు 2011 నుంచి ఇక్కడ నత్తనడకన సాగుతున్నాయి. ప్రపంచ దేశాలు గుర్తించిన ట్రిపోలీ ప్రభుత్వానికి తూర్పు లిబియాపై పట్టు లేదు. ట్రిపోలీలో ఉన్న ప్రెసిడెన్షియల్​ కౌన్సిల్​ సాయం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంది. 

“సోదరులు, స్నేహితులు.. అంతర్జాతీయ వ్యవస్థలు వచ్చి మాకు సాయం చేయండి. ఆదుకుంటామని హమీనివ్వండి,” అని అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తూర్పు  లిబియా యంత్రాగంలో భాగమైన అధికారులు టీవీ ముందుకు వచ్చి అక్కడి పరిస్థితులను వివరించారు. 2వేలమందికి పైగా ప్రజలు మరణించారని ప్రకటించారు. వేలాది మంది గల్లంతైనట్టు వివరించారు.

 “గల్లంతైన వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఇప్పటివరకు 2వేల మంది మరణించారు. డెర్నా మొత్తం ధ్వంసమైంది. చాలా ప్రాంతాలు మాయమైపోయాయి,” అని స్థానికుడు చెప్పాడు. గత వారం గ్రీస్​ను అల్లాడించిన డానియెల్​ తుపాను ఆదివారం నాడు మెడిటరేనియన్​ సముద్రాన్ని దాటింది. తీర ప్రాంతమైన డెర్నాను ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.