కేరళలో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి

ప్రమాదకరమైన నిఫా వైరస్‌ దేశంలో మరోసారి కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రం కోజికోడ్‌ లో జ్వరం కారణంగా రెండు అసహజ మరణాలు సంభవించాయి. దీంతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మరణాలకు నిఫా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ కారణమని ఆరోగ్య శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిపా వైరస్‌ అరుదైన, తీవ్రమైన ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి. గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకుతుంది.
1998లో మలేషియాలో మొదటిసారిగా వైరస్‌ కనుగొనబడింది, అటుతర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వైరస్‌ కేరళలోకి ప్రవేశించింది. 
 కరోనా మహమ్మారి ఏడాది క్రితం.. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పటికీ ఏదోచోట ఈ మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. రోజుకో రకంగా రూపాంతరం చెందుతూ భయకంపితులను చేస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోందని అనుకుంటుంటే ఇప్పుడు నిపా వైరస్‌ భయపెడుతుంది.
 
కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈ ఇద్దరూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం నలుగురు రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. చనిపోయిన వారిలో ఒకరి బంధువు 22 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా 4, 9 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు, 10 నెలల శిశువు కూడా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మృతి చెందిన ఇద్దరి నమూనాలను పూణేలోని ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. ఆ ఫలితాలు మంగళవారం సాయంత్రానికి వస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నిఫా వైరస్‌ అనుమానంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ శాఖ మంత్రి వీణా జార్జ్‌ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
కాగా దక్షిణ భారతదేశంలో తొలిసారి నిఫా వైరస్‌ కేసు మే 19, 2018లో కోజికోడ్‌ జిల్లాలోనే బయటపడింది. ఈ వైరస్‌ కారణంగా 2018, 2021లో మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం జంతువుల నుండి ప్రజలకు ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ లక్షణాలు తొందరగా బయటపడవు. ఈ వైరస్‌ కొందరిలో మెదడువాపుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి.