సముద్ర గర్భ అన్వేషణ దిశలో భారత్

సముద్ర గర్భ అన్వేషణ దిశలో భారత్
సముద్ర గర్భాన్ని శోధించేందుకు భారత్‌ సన్నాహాలు చేస్తున్నది. దీని కోసం రూ.4,077 కోట్లను భారత్‌ వ్యయం చేస్తున్నది. సముద్రయాన్‌ పేరిట మానవ సహిత సముద్ర యాత్ర చేసేందుకు సమాయత్తం అవుతున్నది. 

సముద్రయాన్‌లో భాగంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషియన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐవోటీ)కి చెందిన శాస్త్రవేత్తలు ‘మత్స్య 6000’ పేరిట ఓ సబ్‌మెర్సిబుల్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నారు. డిజైన్‌, టెస్టింగ్‌, మెటిరీయల్స్‌, సర్టిఫికేషన్స్‌, రిడండెన్సీ, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ సహా అన్ని బాధ్యతలను ఎన్‌ఐవోటీ శాస్త్రవేత్తలు తమ భుజాలపై వేసుకున్నారు. వారి రెండేండ్ల కృషి ఫలితంగా ‘మత్స్య 6000’ రూపుదిద్దుకుంది.

ఇప్పటివరకు సముద్ర శోధనలు చేసేందుకు మానవ సహిత సబ్‌మెర్సిబుల్‌ను అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, చైనా, జపాన్‌ మాత్రమే రూపొందించాయి. భారత్‌ రూపొందించిన మత్స్య 6000 ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నది. ఈ ఏడాది జూన్‌లో టైటాన్‌ సబ్‌మెర్సిబుల్‌ సముద్రంలో పేలిపోవడంతో దీనికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

2024 ప్రథమార్ధంలో ముగ్గురు శాస్త్రవేత్తలతో ఈ సబ్‌మెర్సిబుల్‌ చెన్నై తీరంలోని సముద్ర గర్భంలో 500 మీటర్ల లోతుల్లో దిగనున్నది. అన్ని పరీక్షలు పూర్తయితే 2026లో ఈ సబ్‌మెర్సిబుల్‌ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నది. సముద్ర గర్భంలో ఉన్న ఖనిజాల అన్వేషణ, జీవవైవిధ్యంపై పరిశోధనలు చేయడమే సముద్రయాన్‌ మిషన్‌ లక్ష్యం. 

అత్యంత విలువైన లోహాలు, ఖనిజాలను ఈ మిషన్‌లో భాగంగా అన్వేషించనున్నారు. కోబాల్ట్‌, నికెల్‌, మాంగనీస్‌, హైడ్రో థర్మల్‌ సల్ఫైడ్స్‌, గ్యాస్‌ హైడ్రేట్స్‌, కిమోసింథటిక్‌ బయోడైవర్సిటీ, లో టెంపరేచర్‌ మీథేన్‌ సీప్స్‌పై శాస్త్రవేత్తలు దృష్టి సారించనున్నారు. ముందుగా ఇది ప్రయోగాత్మకంగా 500 మీటర్ల లోతువరకూ వెళ్లుతుంది.

ఈ సబ్‌మెరైన్ సముద్రయాన్ పరిశోధనల వల్ల సముద్ర పర్యావరణానికి ఎటువంటి ముప్పు లేదని కేంద్ర ఎర్త్ సైన్స్ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజూ ఈ ఫోటోలు, వీడియోలను విడుదల చేసిన సందర్భంగా విలేకరులకు తెలిపారు. 2026 నాటికి సముద్రయాన్ మిషన్ కార్యరూపంలోకి వస్తుంది. సముద్ర గర్భంలో అపార ఖనిజాలు , వనరులు ఉన్నాయి. ప్రధాని మోదీ నిర్థేశిత బ్లూ ఎకానమి విజన్‌కు ఈ సముద్రయాన్ అద్దం పడుతుందని మంత్రి చెప్పారు.