చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్ కొట్టివేత

స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హౌస్‌ రిమాండ్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ముప్పుపొంచి ఉందన్న వాదనలను కోర్టు తోసిపుచ్చింది. హౌస్‌ కస్టడీకి అనుమతివ్వాలని చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా దాఖలు చేసిన పిటిషన్‌పై రెండోరోజు విచారణ చేపట్టిన కోర్టు హౌస్‌ కస్టడీకి అనుమతి ఇవ్వలేమని తెలిపింది. 

భద్రతా కారణాల దృష్ట్యా చంద్రబాబు అరెస్ట్‌ను హౌస్ రిమాండ్‌గా పరిగణించాలని ఆయన తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు. చంద్రబాబుకు జైలులో పూర్తి భద్రత ఉందని, బయట ఉంటే ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదించారు. హౌస్ రిమాండ్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలిపారు. 

ఈ మేరకు కోర్టు కీలక తీర్పు ఇస్తూ హౌస్ రిమాండ్ పిటిషన్ ను కొట్టివేసింది. చంద్రబాబకు జైలులో ప్రాణహాని ఉందని హౌస్ రిమాండ్ విధించాలని వేసిన పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని ఏపీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అడ్వొకేట్‌ జనరల్‌కు లేఖ రాశారు. కోర్టు ఆదేశాల మేరకు జైలులో చంద్రబాబు భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక బ్యారక్ ఇచ్చామని కోర్టుకు సీఐడీ తెలిపింది. సీఐడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది. పిటిషన్ తిరస్కరణ నేపథ్యంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.

సీఐడీ కస్టడీ పిటిషన్ వాయిదా

కాగా, ఇదే కేసులో అరెస్టైన మాజీ సీఎం, చంద్రబాబు నాయుడును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ పై వాదనలు బుధవారం వాయిదా పడ్డాయి. చంద్రబాబు తరఫు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో కోర్టు రేపటికి వాయిదా వేసింది.  కౌంటర్ పిటిషన్ ను బుధవారం దాఖలు చేస్తామని చంద్రబాబు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

అయితే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ టీడీపీ కార్యకర్త మహేష్‌రెడ్డి, కిలారు నితిన్, గింజుపల్లి సుబ్బారావు వేరువేరుగా ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే సీఐడీ ఎఫ్ఐఆర్ పై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు.

రిమాండ్ రిపోర్ట్ లో ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలన్నీ రాజకీయ కక్షసాధింపులో భాగమేనని తెలిపారు. తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించారని పిటిషన్ వేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదు అయిన నాలుగు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో ఆయన తరఫున లాయర్లు పిటిషన్ వేశారు.

మరోవంక, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలిశారు. అరగంటసేపు వారు చంద్రబాబుతో మాట్లాడారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అని భువనేశ్వరి ఆరోపించారు. ములాఖత్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ…చంద్రబాబు అరెస్టుపై ప్రజాక్షేత్రంలో పోరాడతామని ఆమె స్పష్టం చేశారు.