`స్కిల్’ నిధులకు బాధ్యులు అజయ్ కల్లం, ప్రేమచంద్రారెడ్డి!

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తానిచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏపీ సిఐడి కేసు నమోదు చేసి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినట్లు జరుగుతున్న ప్రచారం పట్ల అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఆర్థిక శాఖలో ఏ తప్పూ చేయలేదని పేర్కొంటూ తానిచ్చిన వాంగ్మూలంను సిఐడి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
 
తాను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవం అంటూ పేర్కొంటూ అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. ఈ విషయంలో సిఐడి తీరుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తాను చెప్పింది సీఐడీ తమకు అనుకూలంగా మార్చుకుందని అనుమానంగా ఉన్నట్లు చెప్పారు.
 
నిధుల వినియోగంలో అక్రమాలు జరిగితే ఆ సమయంలో ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ ఎండీ, కార్యదర్శి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ వారి పేర్లు కేసులో ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. ఒక ప్రాజెక్ట్ ను బడ్జెట్ కేటాయింపు కంటే ముందే పరిశీలించి ఆమోదించాలని, ఆ విధంగా చేసింది అప్పటి ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం అని ఆయన తెలిపారు. 
 
అదే విధంగా, సరిగ్గా అమలు జరిగే విధంగా చూడాల్సింది, నిధుల విడుదలకు బాధ్యత వహించాల్సింది స్కిల్ డెవలప్మెంట్ సంస్థ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి అని చెబుతూ వారిద్దరి పేర్లు కేసులో లేవని గుర్తు చేశారు. అధికారుల తప్పులను నాయకులకు ఆపాదించడమేంటని నిలదీశారు.
 
స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి అప్పట్లో తీసుకున్న విధాన నిర్ణయాల వివరాలు, ఫైల్స్ ఎక్కడున్నాయని పీవీ రమేశ్ ప్రశ్నించారు. వాటిని పరిశీలిస్తే నిధుల వినియోగం వివరాలు క్లియర్ గా తెలుస్తాయని చెప్పారు. చట్టపరమైన విధానాలు పాటించే కార్పొరేషన్ ఏర్పాటు – సీమెన్స్ గుజరాత్ ప్రభుత్వానికీ ఇదే తరహా సేవలు అందించిందని ఆయన గుర్తు చేశారు.