ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ సవాళ్లతోపాటు ఇతర వివిధ సవాళ్లను అత్యవసరంగా పరిష్కరించవలసిన అవసరం ఉందని జి20 సదస్సులో సమావేశమైన ప్రపంచ దేశాల అగ్రనేతలు పిలుపునిచ్చారు.
15 ఏళ్ల క్రితం సంభవించిన ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచ దేశాలు తిరిగి ప్రగతి సాధించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జి20 నేతలంతా సమావేశం కావడమైందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పేర్కొన్నారు. అనేక సవాళ్ల మధ్య మనం కలుసుకున్నామని, సరైన నాయకత్వం కోసం ప్రపంచమంతా జి20 సదస్సు వైపు చూస్తోందని తెలిపారు.
బ్రెజిల్ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తమ దేశం జి20 సదస్సుకు అధ్యక్షత వహించినప్పుడు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల సమీకరణకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.
తీవ్ర ఉద్రిక్తత, అనుసరణ, నష్టాల నివారణ, ఆర్థికంగా సహకరించడం తదితర అంశాలకు, సుస్థిరతకు మధ్య తులనాత్మకత సాధించి వాతావరణ ఎజెండాతో 2025లో ప్రపంచ వాతావరణ సదస్సు (సిఒపి 30)కు తాము చేరుకుంటామని వెల్లడించారు. ప్రతి ఒక్కరి నిర్ణయాన్ని బ్రెజిల్ పరిగణనలోకి తీసుకుంటుందని, అందువల్ల భూగోళం అందం కేవలం అంతరిక్షం నుంచి ఛాయాచిత్రంగా మిగిలిపోదని పేర్కొన్నారు.
జి20లో ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వానికి అంగీకరించడం తమకు ఆనందంగా ఉందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా వెల్లడించారు. తక్కువ కర్బన్ వినియోగం అయ్యేలా పరివర్తన వేగవంతం చేయడానికి, వాతావరణ స్థితిస్థాపకతకు, సుస్థిర సమాజాల స్థాపనకు ప్రపంచ దేశాల పునర్నిర్మాణానికి కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రత్యేక అవకాశం లభించిందని వివరించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ సంక్షోభంలో తక్కువ బాధ్యత కలిగి ఉన్నప్పటికీ, వాతావరణ మార్పుల భారాన్ని భరించవలసి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికం, అసమానత, నిరుద్యోగం వంటి ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, వాతావరణ లక్షాలను సాధించడానికి పాటుపడవలసి వస్తోందని గుర్తు చేశారు.
వాతావరణ మార్పు, పర్యావరణ క్షీణత, నిలకడలేని వినియోగం, ఉత్పత్తి, వనరుల కొరత, తదితర సమస్యలు పరిష్కరించడానికి దేశాల మధ్య సంఘీభావం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధి సాధనకు ప్రపంచ దేశాల భాగస్వామ్యం విస్తరించవలసి ఉందని పిలుపిచ్చారు. పటిష్టమైన ప్రభుత్వాల విధానాల వల్లనే ఇది సాధ్యం అవుతుందని చెప్పారు.

More Stories
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు