మొరాకోను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం.. 632 మంది మృతి 

ఆఫ్రికా దేశమైన మొరాకోను భారీ భూకంప కుదిపేసింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రకేష్‌ ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. 632 మంది మృతి చెందిన్నట్లు, మరో 329 మంది గాయాలకు గురైనట్లు ప్రభుత్వం మీడియా వెల్లడించింది. అయితే అధికారికంగా ఈ మరణాల ఇంకా గణాంకాలు విడుదల కాలేదు. 

భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:11 గంటలకు మరకేష్‌కు నైరుతి దిశగా 44 మైళ్ల (71 కిలోమీటర్లు) దూరంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.  రిక్టర్‌ స్కేల్‌ పై 6.8 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం వల్ల దాదాపు 10 నిమిషాల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

ఈ భూకంపం వల్ల ఇళ్లు కూలడంతో మరణాలు సంభవించాయి. అలాగే అనేక మందికి గాయాలు అయ్యాయి. మర్రకేష్‌కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.  నేలమట్టమైన భవనాలు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన చారిత్రాత్మక మర్రాకెక్ నగరం చుట్టూ నిర్మించిన పురాతన ఎర్ర గోడలు కూలిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియోలను మొరాకో ప్రజలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఆల్‌ హౌజ్‌, మర్రకేష్‌‌, క్వార్జాజేట్‌, అజిలాల్‌ సహా పలు ప్రావిన్సుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది. నగరంలోని రెస్టారెంట్ల నుంచి రోడిస్తూ పరుగులు తీస్తున్న పర్యాటకుల వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ చవిచూడలేదని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

మరోవైపు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.