బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్ఎస్)ను అభివృద్ధి చేయడం కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత న బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంలో భాగంగా మూలధన వ్యయంలో 40 శాతం వరకు ఆర్థిక సహాయాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో బడ్జెటరీ సపోర్టుగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకం ద్వారా 4,000 ఎండబ్ల్యుహెచ్ లతో కూడిన బీఈఎస్ఎస్ ప్రాజెక్టులను 2030-31 నాటికి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ అనుకూల చర్యల జాబితాలో ఒక మహత్తర చర్యగా అభివర్ణించింది. బ్యాటరీ నిల్వ వ్యవస్థలకు అయ్యే వ్యయాన్ని తగ్గించడంతో పాటుగా వాటి లాభదాయకతను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు ల వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం కోసం రూపొందించిన ఈ పథకం లక్ష్యం స్వచ్ఛమైన, ఆధారపడదగిన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్తును ప్రజలకు అందజేయడమే. రూ. 3,760 కోట్ల మేరకు బడ్జెటరీ సపోర్టు సహా రూ. 9,400 కోట్ల ప్రారంభ పెట్టుబడితో కేంద్రం బీఈఎస్ఎస్ పథకాన్ని తలపెట్టింది. ఈ పథకం ఒక్కో కిలో వాట్-అవర్ (కెడబ్ల్యుహెచ్) కు రూ. 5.50-6.60 శ్రేణిలో లెవెలైజ్డ్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ (ఎల్సిఒఎస్)ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా విద్యుత్తుకు గిరాకీ బాగా ఎక్కువగా ఉండే సందర్భాలలో నిలవ చేసిన ఈ విద్యుత్తు తన వంతు పాత్ర ను పోషిస్తుంది.
బిఇఎస్ఎస్ ప్రాజెక్టుల అమలులో వేర్వేరు దశలకు ముడిపెట్టి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ 5 విడదల్లో అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశ ప్రజలకు ప్రయోజనం కల్గించడం కోసం ప్రాజెక్టు సామర్థ్యంలో కనీసం 85 శాతం సామర్థ్యాన్ని విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) కు అందించాలన్న నిబంధన కూడా ఉంది.
తద్వారా గ్రిడ్ సామర్థ్యం పెరగడంతో పాటు పంపిణీ వ్యవస్థలో వృధాను అరికట్టవచ్చని కేంద్రం పేర్కొంది. అలాగే విద్యుత్ పంపిణీ కోసం అవసరమైన మౌలిక వసతులకు అయ్యే భారీ ఖర్చును కూడా వీలైనంత తగ్గిస్తుందని సూత్రీకరించింది. బీఈఎస్ఎస్ పథకం డెవలపర్‌ను ఎంపిక చేయడం కోసం పూర్తి పారదర్శకంగా బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు సమాన అవకాశాలు కల్పించేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించింది.
తద్వారా ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడి, పటిష్టమైన ఇకో సిస్టమ్ తయారవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అనుబంధ పరిశ్రమల్లో అవకాశాలను పెంపొందిస్తుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా