వినాయక చవితికి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు

సెప్టెంబర్‌ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదురోజుల పాటు జరుగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 18వ తేదీన పాత భవనంలో సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత వినాయక చవితిని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 19 నుంచి ఈ సమావేశాలు కొత్త భవనంలో కొనసాగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
 
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్మించిన పార్లమెంట్‌ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని మోదీ ఘనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకు కొత్త భవనంలో ఎలాంటి సమావేశాలూ జరగలేదు. కాగా పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఎందుకు ఏర్పాటు చేశారనేది ఉత్కంఠకు దారితీసింది. ప్రత్యేక సమావేశాల అజెండాను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.
 
శనివారం వెలువరించిన అధికార ప్రకటనలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో క్వశ్చన్ అవర్, జీరో అవర్ , ప్రైవేటు సభ్యుల బిల్లుల ప్రస్తావన ఏదీ ఉండదని తెలిపారు. జమిలి ఎన్నికల బిల్లు తీసుకువచ్చేందుకు లేదా అత్యంత కీలకమైన నిర్ణయం ప్రభుత్వపరంగా ప్రకటించేందురకు ఈ స్పెషల్ సెషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. 
 
కాగా ఎంపిలకు ప్రత్యేకించి గ్రూప్ ఫోటో సెషన్ ఉందని కూడా సమాచారం అందింది. అయితే కొత్త పార్లమెంట్‌కు మారుతున్నందున ఎంపిల బృందం ఫోటోలకు ఏర్పాట్లు జరిగాయని, దీనికంటే వేరే ప్రత్యేకత ఏదీ లేదని ఎంపిలలో కొందరు తెలిపారు.
 
మరోవైపు జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక బిల్లు, ఇండియా పేరు మార్పు వంటి కీలక బిల్లులను కేంద్రం ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే నూతన పార్లమెంట్‌ మొదటి సమావేశంలోనే దేశ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.