సెప్టెంబర్ మూడో వారం నుంచి బీజేపీ బస్సు యాత్రలు 

సెప్టెంబర్ మూడో వారం నుంచి బీజేపీ బస్సు యాత్రలు 

దగ్గరకు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలను  దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. వాస్తవానికి ఈ నెల 17 నుంచే బస్సు యాత్రలను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావించింది. ఇందుకు మూడు మార్గాల్లో యాత్ర షెడ్యూలు కూడా ఖరారు చేసింది. 

అయితే సెప్టెంబర్ 17 తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉండడంతో సెప్టెంబర్ మూడో వారం నుంచి బస్ యాత్ర చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. బస్సు యాత్రల సందర్భంగా ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 119 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 

బస్సు యాత్రలతోపాటు బహిరంగ సభలను 15 రోజుల్లోనే పూర్తి చేసేలా బీజేపీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేశారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ 1600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తే, కొత్తగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి బస్ యాత్రలకు శ్రీకారం చుట్టుతున్నారు.

తెలంగాణలోని మూడు ప్రధాన దేవాలయాల నుంచి యాత్రలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. బాసర నుంచి కిషన్ రెడ్డి, అలంపూర్ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, భద్రాచలం నుంచి పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ యాత్రల సందర్భంగా నియోజకవర్గాల కేంద్రాల్లో చేపట్టే బస్సు యాత్రలకు నేతృత్వం వహించనున్నారు. 

బస్సు బహిరంగసభలకు యాత్ర చేపట్టే రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలను కూడా ఆహ్వానించాలని బీజేపీ భావిస్తోంది. బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో వైపల్యాన్ని ప్రధానంగా ఎత్తిచూపనున్నారు. రెండు దఫాలుగా ఓట్లు వేసి గెలిపించినా సీఎం కేసీఆర్ హామీలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రజలకు వివరించనున్నారు. 

సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిని కూడా బస్సుయాత్రల్లో ప్రజలకు వివరిస్తామని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతోపాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రధాని మోదీ  ప్రభుత్వ విజయాలు, తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ప్రజలకు వివరించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఈ బస్సు యాత్ర ద్వారా తెలంగాణలోని దాదాపు మెజార్టీ నియోజకవర్గాలకు కవర్ చేయొచ్చని భావిస్తున్నారు. ఆ తరువాత పరిస్థితిని బట్టి ఢిల్లీ పెద్దలతో అక్కడక్కడ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.