
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సహకరించకపోయినా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణాలో రైల్వే సదుపాయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి, రాష్త్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు మినహా మైదాన ప్రాంతాల్లో అతితక్కువ రైల్వే నెట్వర్క్ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.
66 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు తీవ్రమైన ప్రయత్నాలేమీ జరగక పోవడంతో ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రజారవాణాలో కీలకపాత్ర పోషించాయని చెప్పారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణలో రహదారులకు సంబంధించి మౌలికవసతులకు పెద్దపీట వేస్తూనే రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడంతోపాటుగా వెంటవెంటనే ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు సంపూర్ణంగా కృషి చేస్తోందని వెల్లడించారు.
అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా అందించాల్సిన తమవంతు సహకారాన్ని అందించడం లేదని విచారం వ్యక్తం చేశారు. 2022లో తెలంగాణ ప్రభుత్వం, నిర్లక్ష్యం సహాయ నిరాకరణ కారణంగా దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు నిలిచిపోయాయని కిషన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు వాటా నిధులు, భూసేకరణలో పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
2014కు ముందు ఏడాదికి 17.4 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం తెలంగాణాలో జరిగాక, నరేంద్రమోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాదికి 55 కిలోమీటర్ల రైల్ లైన్ల నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇటీవలే తెలంగాణలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు సంబంధించి రైల్వే శాఖ ఆమోదముద్ర వేసిందని చెప్పారు. ఇందులో 21 స్టేషన్లకు ఆధునీకరణకు ప్రధానమంత్రి వర్చువల్ మోడ్ లో శంకుస్థాపన చేశారని వెల్లడించారు.
ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ.2,300 కోట్లు విడుదల చేసిందని చెబుతూ సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి రూ.715 కోట్లు,
కాచిగూడ రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ. 421 కోట్లు, చర్లపల్లి టర్మినల్ అభివృద్ధికి రూ.221 కోట్లను విడుదల చేసిందని వివరించారు. ఎంఎంటీఎస్ -ఫేజ్ 2లో భాగంగా పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించారని చెప్పారు.
వరంగల్ లో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఇవి కాకుండా, తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అనేక ప్రాజెక్టులకు పచ్చజెండా ఉపారని తెలిపారు. ఇప్పటికే రూ. 4,686 కోట్లతో ముద్- ఖేడ్ – మేడ్చల్ మధ్య, మహబూబ్నగర్ – డోన్ మధ్య, రూ. 2,854 కోట్లతో గుంటూరు – బీబీనగర్ మధ్య 3 ప్రాజెక్టులు మంజూరయ్యాయని కిషన్ రెడ్డి వెల్లడించారు.
దాదాపు 15 కొత్త ప్రాజెక్టులకు (న్యూ లైన్స్ కోసం) ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతోపాటుగా 8 డబ్లింగ్ లైన్లకు, 3 ట్రిప్లింగ్ లైన్లు, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు పచ్చజెండా ఊపింది. ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ ఫైనల్ లొకేషన్ సర్వేలో 15 కొత్త ప్రాజెక్టులు, 15 అదనపు లైన్ల ప్రాజెక్టులు మొత్తం 30 ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఈ మొత్తం ప్యాకేజీ విలువ రూ.83,543 కోట్లు అని వివరించారు.
More Stories
గిరిజనుల కోసం డిజిటల్ వేదిక “ఆది సంస్కృతి” బీటా వెర్షన్
ఈ20 బ్లెండింగ్ పై సోషల్ మీడియాలో పెయిడ్ క్యాంపెయిన్
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు