‘ఆదిత్య ఎల్1’ నింగిలోకి ఎగిరేందుకు సర్వం సిద్ధం

చంద్రయాన్‌ -3 విజయవంతమైన తర్వాత ఇస్రో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈసారి సూర్యునిపై ఇస్రో ప్రయోగం చేయనుంది. సూర్యుడిపై అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్‌ -1 ప్రయోగానికి 11.50కి పిఎస్‌ఎల్‌వి-సి57 ప్రయోగం ప్రారంభించనున్నట్లు ఇస్రో తెలిపింది. 
ఈ ప్రయోగానికి సంబంధించి లాంచ్‌ రిహార్సల్స్‌, వాహన అంతర్గత తనిఖీలు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని ఇస్రో శుక్రవారం వెల్లడించింది.
ఈ ప్రయోగం విజయవంతం అవుతుందన్న విశ్వాసం తనకు ఉందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సూళ్లూరు పేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం ఉదయం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారిని కోరుకున్నారు.

ఆదిత్య ఎల్ 1 సూర్యుడి కొరోనా, సౌర తుపాన్ల వంటి ఇతర వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది. ప్రయోగించిన నాటి నుంచి నిర్ధారిత కక్ష్య లోకి ఆదిత్య ఎల్ 1 చేరడానికి 125 రోజులు పడుతుంది. పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపడుతున్నారు. సూర్యుడి అధ్యయనం కోసం భారత్ చేపట్టిన తొలి ప్రయోగం ఇది.

ఈ ప్రయోగంలో అంతరిక్ష నౌక సౌర విస్పోటనం, సంఘటనలకు దారితీసే ప్రక్రియల క్రమాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. అంతరిక్ష వాతావరణంపై లోతైన అవగాహనకు ఈ ప్రయోగం దోహదం చేయనుందని ఇస్రో వెల్లడించింది. సోలార్‌ కరోనా యొక్క భౌతిక శాస్త్రం, దాని పని విధానం, సౌర గాలి, ఉష్ణోగ్రత, భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణం వంటి విషయాలను తెలుసుకునే లక్ష్యాలుగా సన్‌ మిషన్‌ ప్రయోగం జరగనుందని ఇస్రో పేర్కొంది.

ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి దిశగా భూమికి సుమారు 1.5 మిలియన్ కిమీల దూరంలోని ఎల్ 1 కక్ష్యలో ఈ వ్యోమ నౌకను ప్రవేశపెట్టనున్నారు. ఇక్కడ భూమి,  సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు దాదాపు సమానంగా ఉండి, వ్యోమ నౌక బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం 46 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది.

ఈ ప్రయోగంలో సూర్యుని వివరణాత్మక అధ్యయనం కోసం ఏడు వేర్వేరు పేలోడ్‌లను కలిగి ఉంటుంది. వీటిలో నాలుగు పేలోడ్‌లు సూర్యుని నుండి వచ్చే కాంతిని గమనిస్తాయి. మిగిలిన మూడు ప్లాస్మా మరియు అయస్కాంత క్షేత్రాలను కొలుస్తాయి. ఆదిత్య ఎల్‌-1లో అతిపెద్ద సాంకేతిక సవాల్‌గా ఉండే పేలోడ్‌ విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనా గ్రాఫ్‌ (విఇఎల్‌సి) దీన్ని పరీక్షించినట్లు ఇస్రో తెలిపింది. గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిపైకి ఉపగ్రహాల్ని పంపగా.. ఇప్పుడు ఆదిత్య ఎల్1తో సూర్యుడిపైకి ఉపగ్రహం పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించబోతోంది.

ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇస్రో అధికారిక వెబ్ సైట్ https://isro.gov.in ద్వారా, అలాగే, ఇస్రో ఫేస్ బుక్ పేజ్, యూట్యూబ్ చానెల్, దూరదర్శన్ సహా పలు వార్తా చానెల్స్ ద్వారా ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆదిత్య ఎల్ 1 తరువాత గగన్ యాన్ ప్రయోగం చేపడ్తామని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి ముగ్గురు వ్యక్తులను మూడు రోజుల పాటు పంపించనున్నామని వెల్లడించారు. గగన్ యాన్ కోసం ప్రభుత్వం రూ. 90.23 బిలియన్లను కేటాయించింది.