కృష్ణానదీ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాలలో ప్రమాద ఘంటికలు

కృష్ణానదీ ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాలలో ప్రమాద ఘంటికలు
నైరుతి రుతుపవనాలపైన పెట్టుకున్న అంచనాల తలకిందులవడంతో ఖరీఫ్ పంటల సాగుపైన రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నా యి. తెలుగు రాష్ట్రాలకు జీవనాడిలా వున్న కృష్ణానది పరివాహకం వర్షభావ దుర్బిక్షంతో వెలవెలబోతోంది. ఆదను దాటిపోతున్నా లక్షలాది ఎకరాల ఆయకట్టులో ఇంకా వరినాట్లు పడనేలేదు.
 
కృష్టానదిలో వరద ప్రవాహం అడుగంటింది. నదిలో నీటి మడుగులు తప్ప మరెక్కడా నీటి కదలికలేదు. ఎగువ నుంచి వస్తున్న కొద్దిపాటి నీటి ఊట కూడా ఆగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానదీ ప్రాజెక్టుల కింద ఆయకట్టు ప్రాంతాలలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ వర్షాకాలంలో ఎగువ నుంచి శ్రీ శైలం ప్రాజెక్టు వరకూ వచ్చిన నీటి ప్రవాహం బొటాబొటిగా వంద టిఎంసీల మార్కు వద్దనే ఆగిపోయింది. 
 
ఇక ఎగువ నుంచి వరద నీరు వస్తుందన్న ఆశలు కూడా అడుగంటుతున్నాయి. మంగళవారం కృష్ణానదిలో నీటి ప్రవాహాలు, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీటి చేరికలు , రిజర్వాయర్లలో ఉన్న నీటినిలువలు పరిశీలిస్తే ఈ ఖరీఫ్ సీజన్ పరిస్థితి ఆందోళన గొలుపుతోంది. 
 
ఈ నీటి సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్ నుంచి ఇప్పటివరకు ఎగువన కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టులోకి 204 టీఎంసీల నీరు చేరుకుంది. ఆల్మట్టి రిజర్వాయర్‌లో గరిష్ట నీటినిలువ సామర్ధం 129టిఎంసీలు కాగా, గరిష్ట స్థాయికి మించి 75టిఎంసీలకు పైగానే నీరు చేరుకుంది. దిగువన నారాయణ పూర్ ప్రాజెక్టులో కూడా గరిష్ట స్థాయి నీటి నిలువ సామర్ధం 37 టీఎంసీలు కాగా, ఈ ప్రాజెక్టులోకి వంద టీఎంసీల నీరు చేరింది.
 
 ప్రస్తుతం అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు గరిష్ట స్థాయి నీటినిలువలతో నిండు కుండలను తలపిస్తున్నాయి. అదే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కృష్ణా నది ప్రాజెక్టుల పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టులోకి 103టిఎంసీల నీరు చేరింది.  ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టు అవసరాలకు విడుదల అతువున్న నీటిని అటుంచితే జూరాల ప్రాజెక్టు దాటుకుని ఇటు కృష్ణా నది ద్వారా, అటు సుంకేసుల ఆనకట్ట దాటుకుని తుంగభద్ర నది ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరిన నీటి ప్రావాహం 100 టీఎంసీలు మాత్రమే అని అధికారులు చెబుతున్నారు.
 
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుత్ ఉత్పత్తి అనంతరం ప్రాజెక్టు నుంచి దిగువకు వదిలిన నీటివల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 40 టిఎంసీల వరకూ నీరు చేరుకుంది. ఎగువ నుంచి వచ్చిన కొద్దిపాటి నీటి నిలువలు కూడా హరించుకు పోతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు పడిపోయింది.
 
 రిజర్వాయర్‌లో నీటినిలువలు 90.56టిఎంసీలకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి ఇటు సాగు, తాగునీటితోపాటు విద్యుత్ ఉత్పత్తి కోసం 13641 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన నాగార్జన సాగర్‌లో నీటిమట్టం 522 అడుగులకు చేరుకుంది. నీటి నిలువ 153టిఎంసీల కు తగ్గిపోయింది. 
 
సాగర్‌లో తగినంత నీటిమట్టం లేకపోవటంతో ఎడమ కాలువకు నీటి విడుదల ప్రశ్నార్ధకంగా మారింది. సాగర్ ప్రాజెక్టుపైన ఆధారపడి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో సుమారు 6లక్షల ఎకరాల ఆయకట్టులో పంటలు వేసుకోలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఎలిమినేటి మాధవ రెడ్డి ఎత్తిపోతల పథకం కింద కూడా ఆయకట్టుకు నీరందే అవకాశాలు అడుగంటాయి.