మోదీ మరోసారి ప్రధాని కావాలంటే తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం

మోదీ గారిని మరోసారి ప్రధానమంత్రిని చేయాలంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
రైతు గోస-బిజెపి భరోసా పేరిట జరిగిన బహిరంగ సభలో అమిత్ షా  ఆదివారం ప్రసంగిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని  పిలుపిచ్చారు. 
తెలంగాణలో అక్రమ, అవినీతి, కుటుంబ పాలకులు, రజాకార్ల మద్దతుతో కొనసాగుతున్న కల్వకుంట్ల ప్రభుత్వానికి తిరోగమనం మొదలైందని చెప్పేందుకే ఇక్కడికి వచ్చానని వెల్లడించారు.   ఈ రైతు వ్యతిరేక, దళిత వ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువత వ్యతిరేక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి పడేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కెసిఆర్, ఓవైసితో బిజెపి కలిసే ప్రసక్తే లేదని  స్పష్టం చేస్తూ ఒవైసితో బిజెపి కనీసం వేదికను కూడా పంచుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలని అమిత్ షా విమర్శించారు. . కాంగ్రెస్‌ పార్టీ సోనియా కుటుంబం కోసం పనిచేస్తుంటే బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందని విమర్శలు చేశారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి కలలను సీఎం కేసీఆర్‌ కల్లలు చేశారని మండిపడ్డారు.
తెలంగాణ విమోచన సంగ్రామంలో నాటి తెలంగాణ యువత ప్రాణత్యాగం చేశారని గుర్తు చేస్తూ కానీ మీరు 9 ఏళ్లుగా రజాకార్ల పార్టీతో అంటకాగుతూ, నాటి ప్రజల త్యాగాలకు విలువ లేకుండా చేశారని కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు. కేసీఆర్ నీ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని ఖమ్మం వేదికగా తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ 4 జి పార్టీ, బిఆర్‌ఎస్ 2జీ పార్టీ, ఎంఐఎం 3జి పార్టీ అని చురకలంటించారు. తెలంగాణ అధికారంలోకి వచ్చేది పిఎం మోదీ  పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన చెబుతూ కెసిఆర్ ధాన్యం కొనుగోలుపై రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 
 
మోదీ సర్కారు ఇప్పటివరకు తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని కేంద్ర మంత్రి చెప్పారు. కెసిఆర్, బిజెపి ఏకమవుతున్నాయని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అబద్ధాలు చెబుతున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు  “ఖమ్మం ప్రజలారా… నా మాట గుర్తుంచుకోండి… ఎన్నికలు వస్తున్నాయి. కేసీఆర్ ఓడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో అధికారంలోకి రానుంది” అంటూ భరోసా వ్యక్తం చేశారు. 
 
శ్రీరామనవమికి భద్రాచలంలో పాలకులు వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్‌ విస్మరించారని ఆరోపించారు.  17వ శతాబ్దం నుంచి తెలంగాణలో ఎవరు పాలించినా రామనవమి  నాడు ప్రభుత్వం తరపున భద్రాచలం రాముని కల్యాణ రామునికి వస్త్రాలు సమర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోందని అమిత్ షా గుర్తు చేశారు. 
 
కానీ, కేసీఆర్‌ కారు భద్రాచలం వెళ్తుంది కానీ ఆలయం వరకు వెళ్లదని పేర్కొంటూ  కేసీఆర్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం నేత ఒవైసీ చేతుల్లో ఉందని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ కారు ఇకపై భద్రాచలం వెళ్లాల్సిన అవసరం లేద్నాటు త్వరలోనే బీజేపీ సీఎం భద్రాచలంలో స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అమిత్ షా వెల్లడించారు.
 
భద్రాచలానికి దక్షిణ భారత అయోధ్యగా పేరుందని చెబుతూ భద్రాచల మందిర నిర్మాణం కోసం భక్తరామదాసు పడిన పాట్లు గుర్తు చేస్తూ నిజాం ఏలుబడిలో జైలుపాలయ్యేందుకు కూడా సిద్ధమయ్యాడని తెలిపారు.  ఇక  కేసీఆర్ భద్రాచలం ఇక రావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.  స్టీరింగ్ చేతుల్లోలేని కేసీఆర్ కారు మనకు అవసరం లేదని స్పష్టం చేశారు.

బీజేపీ నేతలమీద దౌర్జన్యాలు, అక్రమ నిర్బంధాలు చేస్తే, బెదిరింపులకు గురిచేస్తే వాళ్లు వెనక్కు తగ్గుతారని అనుకుంటున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. “మా కిషన్ రెడ్డిని, మా బండి సంజయ్ ను, మా ఈటెల గారిని అడ్డుకుంటే.. మేం వెనక్కు తగ్గం….” అంటూ హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్ ఆనాడు రైతుల కోసం రూ.  22వేల కోట్ల బడ్జెట్ పెడితే  ఇవాళ మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ రూ. లక్షా28వేల కోట్ల బడ్జెట్ ఇస్తున్నారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకోసం రూ. 7 లక్షల కోట్ల అప్పులు, ఇతర సబ్సిడీలిస్తే మోదీ ప్రభుత్వం రూ. 20 లక్షలకోట్ల విలువైన సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు.

ధాన్యం సేకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 475 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేదని, మోదీ ప్రభుత్వం 900 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించిందని చెప్పారు.  బియ్యం మీద కనీస మద్దతు ధర 67శాతం పెరిగిందని,  11కోట్ల మంది రైతులకు, రూ. 2.60 లక్షల కోట్ల కిసాన్ సమృద్ధి నిధిని అందిస్తోందని, 10వేల ఎఫ్ పి ఓలను ఏర్పాటుచేసే పని మోదీ ప్రభుత్వం చేస్తోందని అమిత్ షా వివరించారు.

 
కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రూ. 2 లక్షల కోట్ల నిధులు ఇవ్వగా తమ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ. 2.80 లక్షల కోట్ల నిధులు ఇచ్చిన్నట్లు తెలిపారు. తెలంగాణలో మోదీ గారు 33 లక్షల మంది పేదలకు మరుగుదొడ్లు కట్టించారని,  1.90 లక్షల మంది పేదలకు నెలకు 5కిలోల ఉచిత రేషన్ ఇస్తున్నారు, 11 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని, 2.5 లక్షల మంది పేదలకు ఇండ్లు ఇచ్చారని తెలిపారు.