రైలులో గ్యాస్ సిలిండర్ పేలి 10 మంది సజీవ దహనం

త‌మిళ‌నాడులోని మ‌ధురైలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పున‌లూరు – మ‌ధురై ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ప్ర‌యివేటు పార్టీ కోచ్‌లో మంట‌లు చెల‌రేగి 10 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ల‌క్నో నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న ఈ రైలులో శ‌నివారం తెల్ల‌వారుజామున 5:15 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ల‌క్నో నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న పున‌లూరు – మ‌ధురై ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నాగ‌ర్‌కోయిల్ వ‌ద్ద ప్ర‌యివేటు పార్టీ కోచ్‌ను నిన్న‌ సిబ్బంది చేర్చింది.
ఈ కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న ప్ర‌యాణికులు రైల్వే సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి సిలిండ‌ర్‌ను ర‌హ‌స్యంగా లోప‌లికి తీసుకొచ్చారు. ఇక శ‌నివారం తెల్ల‌వారుజామున మ‌ధురై స్టాబ్లింగ్ లైన్ వ‌ద్ద‌ ప్ర‌యివేటు పార్టీ కోచ్‌ను మ‌ధురై ఎక్స్‌ప్రెస్ నుంచి వేరు చేశారు. ఈ స‌మ‌యంలో చాయ్‌ చేసుకునేందుకు ఆ కోచ్‌లోని ప‌ర్యాట‌కులు సిలిండ‌ర్‌ను వెలిగించారు. దీంతో కోచ్‌లో సిలిండ‌ర్ పేలి మంట‌లు ఎగిసిప‌డ్డాయి. 
 
మంట‌లు చెల‌రేగిన వెంట‌నే కొంత‌మంది ప్ర‌యాణికులు అప్ర‌మ‌త్త‌మైన కింద‌కు దిగేశారు. 10 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఆ ప్యాంట్రీ కోచ్‌లో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అందరూ చూస్తుండగానే బోగీ అంతా మంటలు వ్యాపించాయి. అప్పటికీ కొంత మంది మంటలకు భయపడి రైలు నుంచి కిందికి దిగారు. మరికొంతమంది నిద్రలో ఉండి ఆ మంటలకు సజీవ దహనం అయ్యారు. ఇంకొంత మందికి గాయాలు అయ్యాయి.

అగ్నిమాపక యంత్రాలు, రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేయడంతో పాటు ఆ బోగీ ఉన్న లింక్‌ను తొలగించారు. బోగీ పూర్తిగా దగ్ధమైంది. పటిష్ఠ బందోబస్తు, తనిఖీలు ఉన్నా రైలులోకి నిషేధిత వస్తువులు ఎలా తీసుకువచ్చారు అనే విమర్శలు వస్తున్నాయి.
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీలో 65 మంది ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దక్షిణ రైల్వే అధికారులు.. దీనిపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఘటనపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది.