ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి `సుప్రీం’ నోటీసులు

ఓబులాపురం మైనింగ్‌ కేసులో ఐఎఎస్‌ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌ ఇస్తూ సిబిఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును సిబిఐ ఆశ్రయించింది. 
 
ఈ పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
గనుల కేటాయింపుల్లో ఓబులాపురం మైనింగ్‌ కంపెనీకి లబ్ధి చేశారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి ఉన్నారు. 
 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెన్నా సిమెంట్స్‌కు అక్రమంగా లబ్ధి చేకూర్చిన కేసులో జగన్‌తోపాటు శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. పెన్నా సిమెంట్స్‌ కేసులో జగన్‌, ధర్మాన ప్రసాదరావు, పెన్నా ప్రతాప్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితోపాటు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
 
 వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో అనంతపురంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమ మైనింగ్‌ వ్యవహారాలపై సిబిఐ కేసులు నమోదు చేసింది. అక్రమంగా మైనింగ్‌ లైసెన్సులు మంజూరు చేశారని శ్రీలక్ష్మిపై సిబిఐ అభియోగాలు మోపింది.  గాలి జనార్ధన్‌రెడ్డికి చెందిన ఒఎంసి కంపెనీకి లైసెన్సుల మంజూరులో శ్రీలక్ష్మి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది.
1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి అక్రమ మైనింగ్‌ కేసులో 2011లో అరెస్టయ్యారు. సిబిఐ ట్రయల్‌ కోర్టులో శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఆ తీర్పును ఆమె తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేయగా, ఆమెపై అభియోగాలు కొట్టేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ మేరకు ధర్మాసనం శ్రీలక్ష్మికి నోటీసులు జారీ చేసింది.