మూడోసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ మూడోసారి కూడా ప్రధానిగా బాధ్యతలు చేపడతారని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఏడాదికన్నా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఇండియా టుడే- సీఓటర్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ పేరుతో ఈ నెలలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. సర్వేలో 52 శాతం మంది ఈ విషయాన్ని చెప్పారు.

63 శాతం మంది ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం జరిపిన సర్వేలో 72 శాతం మంది సంతృప్తి చెందగా ఇప్పుడు కాస్త తగ్గింది. మోదీ పనితీరు యావరేజ్‌గా ఉందని 13 శాతం  మంది, బాగులేదని 22 శాతం మంది తెలిపారు. మోదీని చూసే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తామని 44 శాతం మంది చెప్పారు. అభివృద్ధి, హిందుత్వ అంశాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నా వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.

ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ ఉంటే బాగుంటుందని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు. జనవరిలో జరిగిన సర్వేలో ఆయనకు 13 శాతం మందే మద్దతు తెలిపారు. భారత్‌ జోడో యాత్ర కారణంగా ఆయన ఇమేజ్‌ పెరిగిందని 44 శాతం మంది, యాత్ర తర్వాత ఇమేజ్‌ తగ్గిందని 13 శాతం మంది చెప్పారు.

 ప్రతిపక్ష నేతగా ఆయన పనితీరు ‘చాలా బాగుందని’ 34 శాతం మంది తెలిపారు. ఎంపీ పదవి నుంచి ఆయనను తొలగించడం సరైనదేనని 31 శాతం మంది, రాజకీయ ప్రేరేపితమని మరో 31 శాతం మంది అభిప్రాయపడ్డారు. చాలా కఠిన చర్య అని 21 శాతం మంది తెలిపారు.  విపక్ష కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌లకు 15 శాతం మంది చొప్పున మద్దతిచ్చారు. గతంలో కేజ్రీవాల్‌కు 27 శాతం మంది మద్దతివ్వగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది.

కాగా, బీజేపీని ఇండియా కూటమి ఓడించలేదని 54 శాతం మంది తెలిపారు.  ఇండియా కూటమి పేరు మారిస్తే గెలుపు అవకాశాలు బాగుంటాయా అన్నదానికి 39 శాతం మంది ఔనని, 30 శాతం మంది కాదని చెప్పారు. అదేమీ ఆకర్షణీమైన పేరుకాదని, ఓట్లను ఆకర్షించలేదని 18 శాతం మంది తెలిపారు.

బీజేపీ సొంతంగా 287 సీట్లలో గెలుపొంది మెజార్టీ మార్కు దాటనుందని సర్వే అంచనా వేసింది. గత ఎన్నికల్లో 303 సీట్లు సంపాదించగా ఈసారి 13 తగ్గనున్నాయి. ఎన్‌డీఏ కూటమితో అయితే 306 సీట్లు, 43 శాతం ఓట్లు పొందనుంది. బీజేపీకి వచ్చే ఓట్లు శాతం పెరిగి 29కి చేరనుంది. 

మునుపటిలాగానే ఉత్తరప్రదేశ్‌లో విజయాలు సాధించనుంది. మొత్తం 80లో 72వరకు వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి 193 సీట్లు, 41 శాతం ఓట్లు పొందే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ఓట్లు 2 శాతం పెరిగి 22 శాతానికి పెరగనుంది. ఇండియాకు బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ల్లో భారీగా సీట్లు దక్కే అవకాశం ఉంది.