
భారత్ – గ్రీక్ ల మధ్య సైనిక సంబంధాలను, రక్షణ పరిశ్రమలను పెంపొందించుకోవాలని రెండు దేశాల ప్రధాన మంత్రులు నిర్ణయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక రోజు గ్రీస్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ తో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ రెండు దేశాలు ప్రపంచంలో ప్రాచీన దేశాలే కాకుండా ప్రాచీన ప్రజాస్వామ్య దేశాలని, పురాతన కాలం నుండి వాణిజ్య, వ్యాపార సంబంధాలు గల దేశాలని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
“రక్షణ & భద్రత, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విద్య, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి రంగాలలో మా సహకారాన్ని పెంచుకోవాలని, మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని మేము నిర్ణయించుకున్నాము” అని ప్రధాని మోదీ ప్రకటించారు.
ఉగ్రవాదం, సైబర్ భద్రత విషయంలో పరస్పర సహకారంపై ఇరు దేశాలు చర్చలు జరిపాయని ప్రధాన మంత్రి వెల్లడించారు. భారతదేశం, గ్రీస్ కూడా సైనిక సంబంధాలతో పాటు రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడానికి అంగీకరించాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో సహకారం కోసం రెండు దేశాలు కూడా ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ప్రధాని మోదీ ప్రకారం, రెండు దేశాల మధ్య నైపుణ్యం కలిగిన వలసలను సులభతరం చేయడానికి భారతదేశం, గ్రీస్ త్వరలో ‘మైగ్రేషన్, మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందాన్న’ కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి.
కాగా, చంద్రయాన్-3 సాధించిన విజయం కేవలం భారత దేశానికి మాత్రమే సొంతం కాదని, అది యావత్తు మానవాళి సాధించిన విజయమని ప్రధాని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించే సమాచారం శాస్త్రవేత్తలకు, మానవాళికి ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లారోపౌలోవుతో చర్చల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రయాన్-3 విజయవంతమైనందుకు మోదీకి కాటెరినా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. గ్రీస్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్‌ను మోదీకి కాటెరినా ప్రదానం చేశారు. మోదీ శుక్రవారం గ్రీస్ పర్యటన ఏథెన్స్‌లోని గుర్తు తెలియని సైనికుని స్థూపం వద్ద నివాళులర్పించడంతో ప్రారంభమైంది. అనంతరం గ్రీస్ సైనికులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిట్సోటకిస్ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు.
ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆ దేశ విదేశాంగ మంత్రి జార్జి గెరపెట్రిటిస్ స్వాగతం పలికారు. భారతీయ మూలాలుగల ప్రజలు, బాలబాలికలు, పెద్దలు సహా పెద్ద ఎత్తున ఏథెన్స్‌లోని హోటల్ వద్ద మోదీకి స్వాగతం పలికారు. ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ.. మోదీ..’ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలను ఊపుతూ, డ్రమ్స్ వాయిస్తూ ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో మోదీ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రధాని మోదీ ఈ నెల 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న అనంతరం గ్రీస్ వెళ్లారు. భారత దేశ ప్రధాన మంత్రి గ్రీస్‌లో పర్యటించడం సుమారు 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిట్సోటకిస్ 2019లో న్యూఢిల్లీ వచ్చారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము