
దక్షిణ మధ్య రైల్వే అంతటా మౌలిక సదుపాయాల కార్యకలాపాల కల్పనకు ప్రాముఖ్యతనిస్తూ డబ్లింగ్ మరియు ట్రిప్లింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశలో ఆంధ్ర ప్రదేశ్ లో విద్యుదీకరణతో పాటు ప్రధాన ట్రిప్లింగ్ ప్రాజెక్ట్ అయిన విజయవాడ – గూడూరు ట్రిప్లింగ్ ప్రాజెక్ట్ శర వేగముగా పురోగమిస్తోంది.
దీనిలో భాగముగా జోన్ మరో కీలకమైన సెక్షన్ అయిన మనుబోలు – గూడూరు మధ్య 7.4 కి.మీ దూరం వరకు పూర్తి చేసి ప్రారంభించింది . దీనివల్ల గ్రాండ్ ట్రంక్ మార్గం వంటి రద్దీ మార్గాలలో రద్దీని తగ్గించడంలో సహాయపడుతూ రైలు కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ రైలు మార్గం తిరుపతి జిల్లా పరిధిలోకి వస్తుంది.
దీనివలన గూడూరు – సింగరాయకొండ మధ్య 127 కిలోమీటర్ల పరిధిలో నిరంతరాయంగా విద్యుదీకరణతో పాటు మూడో లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ-గూడూరు మధ్య గ్రాండ్ ట్రంక్ మార్గంలో, ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంతం వెంబడి ఉన్న ఈ సెక్షన్, దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలను దక్షిణాది రాష్ట్రాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్యాసింజర్, సరకు రవాణా రైళ్లలో స్థిరమైన పెరుగుదలతో ఈ మార్గం అత్యంత రద్దీగా మారింది. ఈ కీలకమైన సెక్షన్లో రద్దీని తగ్గించేందుకు, విజయవాడ – గూడూరు మూడవ లైన్ ప్రాజెక్ట్ 2015-16లో 288 కి .మీల దూరానికి సుమారు రూ.3246 కోట్లతో మంజూరు చేయబడింది. ఈ ప్రాజెక్ట్ను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నిర్వహిస్తోంది.
అన్ని విభాగాల్లో ఏకకాలంలో పనులు చేపట్టారు. ఇప్పటి వరకు ఉలవపాడు- మనుబోలు మధ్య 120 కిలోమీటర్లు, చీరాల-కరవాడి మధ్య 44 కిలోమీటర్ల మేర సెక్షన్లు పూర్తిచేసి విజయవంతంగా ప్రారంభమయింది. ఇప్పుడు, జోన్ దక్షిణ చివరలో ఉన్న మనుబోలు- గూడూరు మధ్య ముఖ్యమైన సెక్షన్ పూర్తి చేయడంతో, మొత్తం సెక్షన్లోని 171 కిలోమీటర్లు మూడవ లైన్తో పాటు విద్యుద్దీకరణ పూర్తయింది.
మనుబోలు- గూడూరు సెక్షన్ మధ్య ట్రిప్లింగ్, విద్యుదీకరణద్యుద్దీకరణ పనులను పూర్తి చేసిన విజయవాడ డివిజన్లోని మొత్తం బృందాన్ని, ఆర్ వీ ఎన్ ఎల్ అధికారులను జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు.
విజయవాడ- గూడూరు మధ్య మూడో లైన్ పనులను అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్నామని, అన్ని విభాగాలలో ఏకకాలంలో పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత, రద్దీగా ఉండే ఈ మార్గంలో రద్దీని తగ్గిస్తుందని, రైలు కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని ఆయన వివరించారు.
More Stories
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి