
జైలులో ఉన్న తన భర్త ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని, ఆయనపై విష ప్రయోగం జరగవచ్చని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ఆందోళన వెలిబుచ్చారు. తోషఖానా కేసులో దోషిగా తేలిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్ లోని అటక్ జైలులో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈమేరకు శనివారం పంజాబ్ హోంశాఖ కార్యదర్శికి ఆమె లేఖ రాశారు. అటక్ జైలు నుంచి రావల్పిండి లోని అదియాలాకు ఇమ్రాన్‌ను తరలించాలంటూ అధికారులను కోర్టు ఆదేశించిన విషయాన్ని ఆమె లేఖ ద్వారా గుర్తు చేశారు. ఇమ్రాన్ సామాజిక, రాజకీయ హోదా దృష్టా జైలులో బీ క్లాస్ సౌకర్యాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో రెండు సార్లు ఇమ్రాన్‌పై హత్యాయత్నం జరిగిందని, దీంతో ప్రమేయం ఉన్న వారిని ఇంకా అరెస్టు చేయలేదని ఆమె ఆరోపించారు. ఈ నెల మొదట్లో బుష్రా తన భర్తను అరగంటసేపు కలుసుకున్నారు. ఆయనను చూసిన తర్వాత ఆయన చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని, సి క్లాస్ సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆమె ఆందోళన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకు ఇమ్రాన్‌కు అనుమతి ఇవ్వాలని లేఖలో ఆమె డిమాండ్ చేశారు.
More Stories
హెచ్-1బి కొత్త ధరఖాస్తులకే లక్ష డాలర్ల రుసుము
ఇరాన్‌పై మరోసారి తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు
ఆపరేషన్ సింధూర్ తో స్థావరాలు మారుస్తున్న జైషే, హిజ్బుల్