అమెరికాలో తైవాన్ ఉపాధ్యక్షుడి పర్యటనపై డ్రాగన్ కన్నెర్ర

తైవాన్ ద్వీపం చుట్టూ శనివారం చైనా సైనిక విన్యాసాలు చేపట్టింది. మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ పరాగ్వే పర్యటనకు వెళ్లిన తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో అమెరికాలో రెండు చోట్ల ఆగడం చైనాకు కోపం రావడానికి కారణాలని తెలుస్తున్నది. 
 
శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు అమెరికా, ఇతర విదేశీ శక్తులతో కలిసి పని చేయాలని భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తైవాన్‌ను ఈ సందర్భంగా చైనా హెచ్చరించింది. చైనా సైనిక విన్యాసాలను తైవాన్ ఖండించింది.  వచ్చే జనవరిలో జరిగే తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే వారిలో విలియం లాయి ముందు వరుసలో ఉన్నారు. 
 
పరాగ్వే నుంచి తైవాన్ తిరుగు పయనంలో మధ్యలో అమెరికాలో ఆగారు. అమెరికాలో బ్లూంబర్గ్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తైవాన్ స్వతంత్ర దేశం’ అని విలియం లాయి ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో విలియం లాయిని ‘వేర్పాటువాది’ సమస్యాత్మక వ్యక్తిగా చైనా పరిగణిస్తున్నట్లు తెలుస్తున్నది. 
 
తైవాన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా తైవాన్‌ను తాము ప్రజాతంత్ర యుతంగా పాలిస్తున్నట్లు చైనా వాదిస్తున్నది.  చైనా సైన్యం తూర్పు ప్రాంత కమాండ్ ఆధ్వర్యంలో తైవాన్ ద్వీపకల్పాన్ని చుట్టుముట్టింది. సైనిక, నావికా విన్యాసాలు నిర్వహించింది. ద్వీపకల్పం చుట్టూ పెట్రోలింగ్ చేసేందుకు సిద్ధమని ప్రకటించింది.మరోవైపు తమ భూభాగంలోకి శనివారం ఉదయం నుంచి 42 చైనా యుద్ధ విమానాలు, ఎనిమిది యుద్ధ నౌకలు చొచ్చుకు వచ్చాయని తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. తామూ యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను మోహరిస్తామని ప్రకటించింది. 26 యుద్ధ విమానాలు తైవాన్ జలసంధిని దాటి లోపలకు చొచ్చుకుకు వచ్చాయని ఆరోపించింది.