ఆధార్ అప్‌డేట్ పేరిట సైబర్ మోసగాళ్ల దగా!

ఇప్పుడు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్న, ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా, ప్రత్యేకించి వాహనాలు కొన్నా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా ఆధార్ తప్పనిసరి. ఆధార్ లో నమోదు చేసుకున్నప్పుడు ఏదైనా పొరపాట్లు నమోదు కావచ్చు.  చిన్న పిల్లలైతే పుట్టిన తేదీ ప్రకారం ఐరిష్, ఫింగర్ ప్రింట్స్ అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది. మరి కొందరు ఇంటి చిరునామా మార్చుకోవల్సి వస్తుంది.
ఈ పరిస్థితుల్లో ఆధార్ అప్ డేట్ కోసం విశిష్ట్ర ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. కానీ, ప్రస్తుతం ఆర్థిక సేవలు మొదలు డ్రైవింగ్ లైసెన్స్ వరకూ ప్రతిదీ ఆన్‌లైన్ కావడంతో సైబర్ మోసగాళ్లు దగా చేస్తున్నారు. ఆధార్ అప్ డేట్ అంటూ మెసేజ్‌లు అధికారిక సంస్థల పేరిట పంపుతున్నారు.
మీ ఈ-మెయిల్‌కూ, వాట్సాప్‌కూ సందేశాలూ,లింక్స్ పంపుతున్నారు. ఇటువంటి లింక్‌లు, మెసేజ్‌లు వస్తే అప్రమత్తంగా ఉండాలి. పౌరులు తమంతట తాము ఆధార్ అప్‌డేట్ చేసుకుంటారే తప్పా అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వ సంస్థలు కోరవు.  కానీ ఆ సంస్థల పేరిట సైబర్ మోసగాళ్లు మీ వ్యక్తిగత డేటా తస్కరించేందుకు మోసాలకు తెర తీస్తున్నారు.
ఉచితంగా ఆధార్ అప్‌డేట్ చేసుకునే గడువు ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో తమకు వచ్చే లింక్‌లు, మెసేజ్‌లు నిజమేనని నమ్మే ప్రమాదం ఉందని గుర్తించిన ఉడాయ్ హెచ్చరికలు జారీ చేసింది.‘పౌరుల వ్యక్తిగత గుర్తింపు లేదా చిరునామా వివరాలను ఏనాడూ యూఐడీఏఐ అడగదు. ఆధార్ అప్ డేట్ చేసుకోండంటూ పౌరులకు వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా మెసేజ్ లు పంపదు.
మీకు దగ్గరలో గల ఆధార్ కేంద్రాలు లేదా మై ఆధార్ పోర్ట్ ద్వారా మాత్రమే ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోండి’ అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో హెచ్చరించింది.  ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతర మార్గాల్లో ఆధార్ అప్ డేట్ చేసుకోవద్దని సూచించింది. భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) మార్గదర్శకాల ప్రకారం ప్రతి పదేండ్లకోసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి. ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకోవడానికి గత నెల 14తో గడువు ముగిసినా.. వచ్చేనెల 14 వరకూ యూఐడీఏఐ పొడిగించింది.

ముందుగా మీరు మీ ఆధార్ నంబర్‌తో ఆధార్ ఆన్ లైన్ పోర్టల్‌లో లాగిన్ కావాలి.. Proceed to Update Address ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. అటుపై డాక్యుమెంట్ అప్ డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద కనిపించే మీ ఆధార్ వివరాల్లో సవరణలు చేయాల్సి ఉంటే.. చేసి నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి.

తదుపరి స్క్రీన్‌పై డ్రాప్ డౌన్‌ను ఎంచుకుని అందులో గుర్తింపు కార్డు, చిరునామా గుర్తింపు ఆప్షన్ ఎంచుకోవాలి.. అక్కడ స్కాన్ చేసిన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరి. 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. అలా ఆధార్ అప్ డేట్ ప్రక్రియ పూర్తవుతుంది.