మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతి

మావోయిస్టు అగ్రనేత,  కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్‌ సాయన్న కన్నుమూసినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం. రాజారెడ్డి  మృతి చెందిన వీడియోను సోషల్ మీడియా ద్వారా మావోయిస్టులు విడుదల చేశారు. .ఈ మృతిని ఛత్తీస్ ఘడ్ పోలీసులు కూడా ధ్రువీకరించారు.

మల్లా రాజిరెడ్డి స్వస్థలం పెద్దపెల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్‌ పరిధిలోని శాస్త్రులపల్లి. మల్లారెడ్డి కొద్దిరోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా దండకారణ్యంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. సంగ్రామ్‌, సాయన్న, మీసాల సాయన్న, అలోక్‌, అలియాస్‌ దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది.
కరీంనగర్ కు చెందిన రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో ఒకరు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో మావోల కార్యకలాపాల విస్తరణలో మల్లా రాజరెడ్డి కీలక పాత్ర పోషించారు.  కేరళ, కర్ణాటక మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్‌ఛార్జ్‌గా కూడా పని చేశారు. 
మల్లా రాజిరెడ్డికి స్నేహలత అనే ఒక కూతురు ఉంది. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ లో పనిచేస్తున్న కాలంలో ఆమెను ఉద్యమ సహచరుడు, ఓయూ ప్రొఫెసర్ కాశీం పెళ్లి చేసుకున్నారు.  1975లో మల్లా రాజిరెడ్డి ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పీపుల్స్ వార్ అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తిల సహచరుడిగా రాజిరెడ్డి ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. దేశవ్యాప్తంగా రాజిరెడ్డిపై వివిధ రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి.
 
ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు హత్య కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. 2008 జనవరిలో కేరళలో రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. ట్రాన్సిట్‌ వారెంట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజిరెడ్డి రెండున్నరేళ్లు కరీంనగర్ జైలులో ఉన్నారు. 
 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా తపాల్‌పూర్‌లో నలుగురి హత్య కేసులోనూ రాజిరెడ్డి నిందితుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌ వార్‌ చేసిన సమయంలో తొలి హత్యగా తపాల్‌పూర్‌ ఘటన. ఆ కేసులో ఎ 1 గా కొండపల్లి సీతారామయ్య, ఎ 2గా రాజిరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేయటం గమనార్హం.