వాజ్‌పేయి వ‌ర్ధంతి.. రాష్ట్ర‌ప్ర‌తి, ప్ర‌ధాని నివాళి

 
నేడు మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ఐదవ వ‌ర్ధంతి. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము, ప్ర‌ధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని స‌దైవ్ అట‌ల్ స్మార‌క వ‌ద్ద పుష్పాంజ‌లి ఘ‌టించారు. వ‌ర్ధంతి సంద‌ర్భంగా అట‌ల్ స‌మాధిని పుష్పాల‌తో అలంక‌రించారు.  ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌, హోంశాఖ మంత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు కూడా నివాళి అర్పించారు. వాజ్‌పేయి నాయ‌క‌త్వం నుంచి దేశం చాలా ల‌బ్ధి పొందిన‌ట్లు ప్ర‌ధాని మోడీ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు.

భారత దేశ అభ్యున్నతిని పెంపొందించేందుకు వాజ్‌పాయి విశేష కృషి చేశారని ప్రధాని తెలిపారు. అన్ని రంగాలనూ విస్తృత స్థాయిలో 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడానికి ఆయన సేవలు దోహదపడ్డాయని పేర్కొన్నారు. వాజ్‌పాయి వర్ధంతినాడు ఆయనకు నివాళులర్పిస్తున్న 140 కోట్లమంది భారతీయుల్లో తాను కూడా ఒకడినని మోదీ బుధవారం ట్వీట్ చేశారు.

బీజేపీ నుంచి ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తొలి నేత వాజ్‌పాయి. ఆయన పార్టీకి ప్రజాదరణ సాధించడంలో విజయం సాధించారు. ఆరేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయన ప్రభుత్వ హయాంలో సంస్కరణలను అమలు చేసి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఆయన 2018 ఆగస్టు 16న 93 ఏళ్ల వయసులో పరమపదించారు.

తొలిసారి బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీయేకు కీలక నేతలు కూడా వాజ్‌పేయి వర్ధంతి కార్యక్రమంలో హాజరుకావడం విశేషం. వాజ్‌పేయి వర్ధంతి కార్యక్రమానికి హాజరై నివాళులర్పించిన ఎన్డీయే నేతల్లో శరద్ పవార్ ఎన్‌సీపీ నుంచి బయటకు వచ్చిన ప్రఫుల్ పటేల్, అన్నాడీఎంకే నేత ఎం.తంబిదురై, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్ మోర్చా చీఫ్ జితిన్ రామ్ మాంఝీ, కేంద్ర మంత్రి, అప్నాదళ్ (సోనెలాల్) నేత అనుప్రియ పటేల్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ చీఫ్ సుదేశ్ మహతో, నేషనల్ పీపుల్స్ పార్టీ ఎంపీ అగతా సంగ్మా, తమిళ మానిల కాంగ్రెస్ చీఫ్ జీకే వాసన్ తదితరులు ఉన్నారు.