వారంలో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్‌ 3

గత నెల 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్‌-3 విజయపథాన దూసుకుపోతున్నది. నిర్దేశించుకొన్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నది. చంద్రుడి వైపునకు మరింత దగ్గరిగా పయనిస్తూ జాబిల్లి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్‌ అయ్యేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.  చంద్రయాన్‌-3లో భాగమైన విక్రమ్‌(ల్యాండర్‌), ప్రగ్యాన్‌(రోవర్‌) చందమామపై ల్యాండ్‌ అయ్యేందుకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్నది.
అన్నీ అనుకొన్నట్టు జరిగితే, జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్‌-3 ఈనెల 23న విజయవంతంగా అడుగుపెడుతుంది.  ఇందులో భాగంగా గత నెల రోజుల నుంచి చంద్రయాన్‌ గమనాన్ని పర్యవేక్షిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం మరోసారి చంద్రయాన్‌ కక్ష్య తగ్గింపును చేపట్టారు. దీంతో ప్రస్తుతం చంద్రయాన్‌ జాబిల్లి ఉపరితలానికి 150*177 కిలోమీటర్ల దూరం తిరుగుతున్నదని ఇస్రో వెల్లడించింది.
 
ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌ తిరుగుతున్న కక్ష్యను క్రమంగా తగ్గించి, జాబిల్లిపై ల్యాండర్‌, రోవర్‌ను సురక్షితంగా దిగేలా తగిన చర్యలు తీసుకొంటారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 8.30 గంటలకు కక్ష తగ్గింపు ఆపరేషన్‌ ఉంటుందని ఇస్రో ప్రకటించింది.  దీని ద్వారా చంద్రయాన్‌ 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రణాళిక ప్రకారం ఆగస్టు 23న ల్యాండింగ్‌ మాడ్యూల్‌(విక్రమ్‌, ప్రగ్యాన్‌) చంద్రుడి ఉపరితలంపై దిగాల్సి ఉన్నది. కీలకమైన సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ముందు 100 కిలోమీటర్ల కక్ష్యలో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోవాల్సి ఉంటుంది. 
ఇది స్పేస్‌క్రాఫ్ట్‌ వృత్తాకార కక్ష్యలోకి(ఆగస్టు 16) మారిన ఒక రోజు తర్వాత ఈ చర్య జరుగుతుంది.
 
అనంతరం విక్రమ్‌ను చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. అయితే చంద్రుడి ఉపరితలం సమీపిస్తున్నప్పుడు ల్యాండర్‌ వేగాన్ని సమాంతరం నుంచి వర్టికల్‌ దిశగా మార్చడమనేది చాలెంజింగ్‌ విషయం. 30 కిలోమీటర్ల కక్ష్య నుంచి ల్యాండర్‌ వేగాన్ని తగ్గిస్తూ విజయవంతంగా చంద్రుడి గడ్డపై తుది ల్యాండింగ్‌ చేయాల్సి ఉంటుంది.
 
ఇలా ఉండగా, అమెరికా, రష్యా పంపినట్టుగా నాలుగైదు రోజుల్లో చంద్రుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపాలంటే ‘ఇస్రో’కు శక్తివంతమైన రాకెట్లు కావాలి. ‘చంద్రయాన్‌-3’ రాకెట్‌లో వాడింది రసాయన ఇంధనం. అంగారకుడిపైకి స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపాలంట ‘చంద్రయాన్‌-3’లో వాడిన రాకెట్‌ సరిపోదు. అంతరిక్షంలో సుదూరమైన గమ్యస్థానాల్ని చేరటం కోసం అణు ఇంధనంతో నడిచే రాకెట్‌ తయారీపై ఇస్రో దృష్టిసారించింది. దీనికి సంబంధించి ‘బాబా అణు పరిశోధన కేంద్రం’తో కలిసి ప్రయోగాలు చేస్తున్నామని ఇస్రో వర్గాలు వెల్లడించాయి.