రష్యాలో గ్యాస్‌ స్టేషన్‌లో పేలుడు.. 35 మంది మృతి

రష్యా దక్షిణ ప్రాంతంలోని డాగేస్తాన్‌లోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 35 మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు మొత్తం మృతుల సంఖ్య 35కు పెరిగింది. మరో 102 మంది గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయం 6.00 గంటల సమయంలో పేలుడు సంభవించిందని డగెస్టాన్‌ రీజియన్‌ హెడ్‌ సెర్గీ మెలికోవ్‌ తెలిపారు. గ్యాస్‌ స్టేషన్‌ పేలుడుకు ముందే దానికి ఎదురుగా ఉన్న కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌లో పేలుడు సంభవించిందని, ఆ మంటలు చుట్టూ 600 మీటర్ల పరిధి వరకు విస్తరించాయని, ఆ క్రమంలోనే గ్యాస్‌ స్టేషన్‌కు మంటలు అంటుకుని ఇంధన ట్యాంకులు పేలిపోయాయని మెలికోవ్‌ చెప్పారు.
గ్యాస్‌ స్టేషన్‌లోని మొత్తం 8 ఇంధన ట్యాంకుల్లో 2 ట్యాంకులు పేలిపోయాయన్నారు. హీట్‌ కారణంగా మళ్లీ పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉండటంతో స్థానికులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ అగ్ని ప్రమాదంలో పలు కార్లు కాలి బూడిదయ్యాయి. ఓ భారీ అంతస్థుల భవనం దగ్ధమైనట్లు సమాచారం తెలుస్తోంది.

దీంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పరిసర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది 260 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు. మూడున్నర గంటల కంటే ఎక్కువ సమయం శ్రమించాక మంటలు అదుపులోకి వచ్చాయి.