ఐదో టీ20లో టీమిండియా పరాజయం

వెస్టిండీస్ పర్యటనను టీమిండియా నిరాశతో ముగించింది.  బ్యాటర్ల వైఫల్యానికి, బౌలర్ల నిస్సాహయత తోడవడంతో వెస్టిండీస్‌తో ఐదో టీ20లో భారత్‌ పరాజయం పాలైంది. వర్షం అంతరాయం మధ్య సాగిన పోరులో టీమ్‌ఇండియా ప్రభావం చూపలేకపోయింది.  ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన నిర్ణయాత్మక పోరులో భారత్‌ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ చేతిలో ఓడింది.
దీంతో 3-2 తేడాతో టీ20 సిరీస్‍ను విండీస్ కైవసం చేసుకుంది.  అమెరికాలోని లౌడర్‌హిల్ వేదికగా జరిగిన ఐదో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది.  ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (45 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ (18 బంతుల్లో 27 పరుగులు) రాణించాడు. అయితే, మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. 
 
వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ నాలుగు, అకీల్ హొసీన్, హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశారు. బ్రెండెన్ కింగ్ (55 బంతుల్లో 85 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో వెస్టిండీస్ లక్ష్యాన్ని18 ఓవర్లలోనే ఛేదించింది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 171 పరుగులు చేసింది.  నికోలస్ పూరన్ (35 బంతుల్లో 47 పరుగులు) కూడా రాణించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, తిలక్ వర్మకు చెరో వికెట్ దక్కింది. గత మ్యాచ్‌లో మన ఓపెనర్లు తొలి వికెట్‌కు 165 పరుగులు జోడించగా.. ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు కోల్పోయి కూడా సరిగ్గా అన్నే పరుగులు చేయడం కొసమెరుపు.

.