
77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం ఉదయం తొలుత రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. దేశ క్షేమం కోసం ప్రార్థించారు. అనంతరం రాజ్‌ఘాట్ నుంచి ఎర్ర కోటకు వెళ్లారు మోదీ. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. కొన్ని క్షణాల తర్వాత ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు మోదీ. అనంతరం ఐఏఎఫ్ హెలికాప్టర్ మువ్వనెల జెండాపై పూల వర్షం కురిపించింది.
అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మన యువత సొంత ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశ పెడుతోందని, ఆకాశమే హద్దుగా మన యువత అనేక రంగాల్లో సత్తా చాటుతోందని కొనియాడారు. అమృతకాలంలో నవయవ్వన భారతం ఆవిష్కృతమవుతోందని తెలిపారు. అభివృద్ధి మహానగరాలకే కాదని, చిన్న పట్టణాలకు విస్తరిస్తోందని, చిన్న పట్టణాల్లోని యువత సాంకేతికతలో కొత్త మెరుపులు మెరిపిస్తోందని మోదీ వివరించారు. పేద క్రీడాకారులు కూడా సమున్నత స్థానాలను అందుకున్నారని ప్రశంసించారు.
“ప్రపంచంలో మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం విశ్వంలో నంబర్ 1గా ఉన్నాం. ఇంత విశాల దేశం.. 140 కోట్ల మంది జనాభాగా ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని తెలిపారు.
బాపూజీ చూపిన అహింస మార్గంలో స్వాతంత్య్రం సాధించామని చెబుతూ ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ శతజయంతి జరుపుకుంటున్నామని తెలియజేశారు. రాణి దుర్గావతి, మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిది అని కొనియాడారు. వ్యవసాయ రంగంలో మన రైతుల కృషి సాటిలేనిదని ప్రధాని ప్రశంసించారు. ప్రపంచానికి ఆహార ధాన్యాలు అందించే స్థాయికి మన రైతులు ఎదిగారని, భారతీయ శ్రామికవర్గం చెమటొడ్చి జాతి సంపదను పెంచుతోందని ప్రధాని కొనియాడారు. చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు కొత్త దశాదిశను నిర్దేశిస్తున్నాయని మెచ్చుకున్నారు.
భవిష్యత్‌పై భారతీయుల్లో విశ్వాసం పెరిగిందని, దీంతో భారత్ పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగిందని, సంపూర్ణ భారత జాతి కృషి ఫలితంగా ప్రపంచం మనవైపు చూస్తోందని మోదీ ప్రశంసించారు. కొత్త సామర్థాలను పుణికిపుచ్చుకుని భారత్ ప్రపంచంలోని తన స్థానం నిలుపుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నో సమస్యలున్నా కేంద్ర, రాష్ట్రాలు కలిసి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామని చెబుతూ దేశ నారీ శక్తి, యువ శక్తి, రైతుల శక్తి దేశాన్ని ముందుకు నడిపిస్తోందని ప్రధాని చెప్పారు.
ఇది అమృతకాలంలో మొదటి సంవత్సరం. మనం ముందుకు అడుగులు వెయ్యాలి. వచ్చే వెయ్యేళ్లపాటూ దేశానికి స్వర్ణయుగం ఉంటుంది. దానికి మనం అడుగులు వెయ్యాలి. సరికొత్త ఆత్మవిశ్వాసంతో, సరికొత్త సంకల్పంతో ముందుకు వెళ్లాలని ప్రధాని పిలుపిచ్చారు. విశ్వంలో భారత్ పట్ల సరికొత్త ఆకర్షణ, విశ్వాసం, ఆశ కలుగుతున్నాయని చెబుతూ ఇప్పుడు మన దగ్గర ప్రజాస్వామ్యం ఉంది. మన దగ్గర వైవిధ్యం ఉంది. యువతతో భారత్ జోరుగా ఉంది. కోట్ల మంది సంకల్పం, ఆలోచనలతో భారత్ ఉంది. మనం ఇప్పుడు ఏం చేసినా.. వచ్చే వెయ్యేళ్లపాటూ అది దిశానిర్దేశంగా మారుతుందని మోదీ భరోసా వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని అంటూ మన రీతి, నీతిని గమనిస్తున్నాయని, ఇప్పుడు మనం జి20 సదస్సును నిర్వహించుకుంటున్నామని తెలిపారు. భారత్‌లో వైవిధ్యాన్ని ప్రపంచం చూస్తోందని, దానితో భారత్ పట్ల ఆకర్షణ పెరిగి ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ప్రపంచంలోని రేటింగ్ ఏజెన్సీలన్నీ భారత్‌ని గౌరవిస్తున్నాయని గుర్తు చేశారు.
కరోనా తర్వాత ప్రపంచం భారత్‌వైపు చూస్తోందని పేర్కొంటూ నేడు విశ్వం భారతీయుల్ని గౌరవిస్తోందని, భారతీయుల సమర్థతను ప్రపంచ దేశాలు చూస్తున్నాయని ప్రధాని చెప్పారు. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలు పతనం అవుతున్నా మనం మాత్రం కేంద్రం అవుతున్నామని చెబుతూ ప్రపంచ ఎకానమీకి భారత్ అవసరం ఏర్పడుతోందని తెలిపారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!