పిల్లల సంరక్షణకు కేంద్రం 730 రోజుల సెలవులు

 
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న మహిళా, ఒంటరి పురుష ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పిల్లల సంరక్షణ నిమిత్తం ఏకంగా 730 రోజులు సెలవులకు అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు.
 
కేంద్ర వ్యవహారాలకు సంబంధించి సివిల్ సర్వీసెస్, ఇతర విభాగాల్లో నియమితులైన మహిళా, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్ 1972లోని 43సీ ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ (సిసిఎల్)కి అర్హులని తెలిపారు. వారి మొదటి ఇద్దరు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ వారి సంరక్షణ కోసం మొత్తం సర్వీసులో గరిష్టంగా 730 రోజులు సెలవు తీసుకోవచ్చని వెల్లడించారు.

‘‘ సివిల్ సర్వీసులు, కేంద్ర వ్యవహారాలతో సంబంధమున్న శాఖలు, విభాగాల్లో నియమించబడ్డ ప్రభుత్వ మహిళా, ఒంటరి పురుష ఉద్యోగులు తమ పిల్లల సంరక్షణ సెలవులకు అర్హులు. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1972లోని రూల్ 43-సీ ప్రకారం ఉద్యోగులకు సెలవులు లభిస్తాయి. ఉద్యోగులు తమ పూర్తికాల సర్వీసులో గరిష్ఠంగా 730 రోజులు సెలవులకు అర్హులు. ఈ విషయంలో జీవించి ఉన్న ఇద్దరు పెద్ద పిల్లల వయసు 18 ఏళ్ల వరకు, అంగవైకల్యమున్న పిల్లల విషయంలో వయసుకు పరిమితలేదు’’ అని మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంట్‌‌కు వివరించారు.