రెట్టింపుకు పైగా పెరిగిన ఎస్‌బిఐ లాభాలు

ప్రభుత్వ రంగంలోని దిగ్గజ విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) అంచనాలు మించి నికర లాభాలు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ)1లో రెట్టింపు పైగా వృద్థితో రూ.16,884 కోట్ల లాభాలు ప్రకటించింది. రూ.15వేల కోట్ల లాభాలు నమోదు కావొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేయగా అంతకంటే మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. 

మూడు మాసాల కాలంలోనే ఈ స్థాయిలో నికర లాభాలు ఆర్జించడం ఎస్‌బిఐ చరిత్రలోనే తొలిసారి. 2022- 23 ఇదే క్యూ1లో రూ.6,068 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ రూ.16,694 కోట్ల రికార్డ్‌ లాభాన్ని ప్రకటించింది. గడిచిన క్యూ1లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 24.7 శాతం పెరిగి రూ.34,905 కోట్లుగా చోటు చేసుకుంది. 

ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.31,195 కోట్ల ఎన్‌ఐఐ నమోదు చేసింది. ఏడాదికేడాదితో పోల్చితే 2023 జూన్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు రూ.1,13,271 కోట్ల నుంచి రూ.91,327 కోట్లకు తగ్గాయి. ఇదే సమయంలో కేటాయింపుల భారమూ రూ.4,392 కోట్ల నుంచి రూ.2,501 కోట్లకు తగ్గాయి. 

బ్యాంక్‌ స్థూల నిరర్తక ఆస్తులు 3.91 శాతం నుంచి 2.76 శాతానికి పరమితమయ్యాయి. నికర నిరర్థక ఆస్తులు మాత్రం 0.67 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 0.71 శాతానికి చేరాయి. గడిచిన త్రైమాసికం ముగింపు నాటికి ఎస్‌బిఐ రుణ పుస్తకం 14 శాతం పెరిగి రూ.33.03 లక్షల కోట్లకు చేరింది. 

ఏడాది క్రితం ఇదే జూన్‌ నాటికి రూ.29 లక్షల కోట్ల లోన్‌ బుక్‌ నమోదయ్యింది. అటో రంగ రుణాలు తొలిసారి రూ.1 లక్ష కోట్ల మార్క్‌ను చేరాయి. వ్యవసాయ, కార్పొరేట్‌ రుణాలు వరుసగా 14.84 శాతం, 12.38 శాతం చొప్పున పెరిగాయని ఎస్‌బిఐ వెల్లడించింది. మరోవైపు డిపాజిట్లు 12 శాతం వృద్థితో రూ. 40.45 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.