ఆర్టీసీ బిల్లుపై అయిదు ప్ర‌శ్న‌లకు వివరణ కోరిన గవర్నర్

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరారు. మరోవంక, చర్చలకు రాజ్‌‌భవన్‌కు రావాలంటూ ఆర్టీసీ యూనియన్ నేతలకు గవర్నర్ ఆహ్వానం పంపారు
”ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్‌ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు?” అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరారు.

1. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.

2. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు.

3. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి? అని ప్రశ్నించిన గవర్నర్.

4. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.

5. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.

ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలను గవర్నర్ కోరారు. మరి ఈ ఐదు అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.