ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ ఆమోదంలో జాప్యం 

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై సంతకం చేసేందుకు మరింత సమయం కావాలని గవర్నర్ డా. తమిళిసై సౌజ్దరాజన్ తెలిపారు. న్యాయ పరమైన అంశాలు పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ పేర్కొంటూ మీడియా నోట్ విడుదల చేశారు. ఆర్టీసీ ముసాయిదా బిల్లు 2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరింది.

బిల్లును 3 నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపింది. ఆర్ధిక అంశాలు ఇమిడి ఉండడంతో అందుకు గవర్నర్ ఆమోదం తప్పనిసరి కాగలదు.  కాగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని హడావుడిగా నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సర్కార్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది.

ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్టీసీ బిల్లుని ప్రవేశపెట్టాలనుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊహించని పరిణామం  ఎదురైంది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్‌ ఆమోదం కోసం ప్రభుత్వం బిల్లుని పంపించగా ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం లభించలేదు. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు మాత్రమే జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం, అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు  నెలల్లో వచ్చే అవకాశం ఉన్నందున ఇవే దాదాపుగా చివరి సమావేశాలని భావిస్తున్న సమయంలో అసెంబ్లీ ఆమోదం ఈ లోగా పొందటం అనుమానాస్పదంగా మారింది.