
చైనాలో గత శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా దేశ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. గత వందేళ్ల వర్షపాతాన్ని రికార్డు బ్రేక్ చేసేలా అక్కడ వర్షపాతం నమోదైంది. దాదాపు గత 140 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు కురిశాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు 20 మంది మృతి చెందారు. 27 మంది గల్లంతయ్యారు.
ముఖ్యంగా చైనా రాజధాని బీజింగ్ లో ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఒక్క బీజింగ్ నగరంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇక హెబీ ప్రావిన్సు లో మరో 9 మంది మరణించారు.
ఈ వరదల్లో మొత్తం 27 మంది గల్లంతయ్యారు. ఈ జల విలయంతో బీజింగ్ లో అనేక ఇళ్లు నీట మునిగాయి. రహదారులు పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పలుచోట్ల వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా అప్రమత్తమైన అధికారులు రైల్వే స్టేషన్లను మూసివేశారు.
వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదలకు 5 లక్షల మంది ప్రజలు ప్రభావితులైనట్లు స్థానిక మీడియా నివేదించింది. బీజింగ్ లో వర్షపాతం చాలా తక్కువగా నమోదువతుంటుందని, అయితే, ప్రస్తుతం కురిసిన వర్షం ధాటికి గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు రికార్డు స్థాయిలో సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
2012లో వచ్చిన టైఫూన్ వల్ల అప్పుడు బీజింగ్‌లో 77 మంది మరణించారు. బీజింగ్ శివర్లలోని రిజర్వాయర్ వద్ద శనివారం నుండి బుధవారం ఉదయం మధ్యలో రికార్డు స్థాయిలో 744.8 మి.మీ (29.3 అంగుళాలు వర్షపాతం) అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. 1891 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం అని బీజింగ్ నగర వాతావరణ శాఖ తెలిపింది.
ఇక గడచిన 40 గంటల్లో నమోదైన వర్షపాతం గత నెల జూలై నెలలో నమోదైన సగటు వర్షపాతానికి దగ్గరగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉష్ణమండల తుఫాను డోక్సూరి గతవారం దక్షిణ ఫుజియాన్ ప్రావిన్స్‌ను తాకినప్పటి నుండి రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉష్ణమండల తుఫాను టైఫూన్ అవశేషాలు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలను దెబ్బతీస్తూనే ఉన్నందున బీజింగ్‌కు నైరుతి దిశలో 60 కి.మీ (37 మైళ్లు) దూరంలో ఉన్న జువోజౌ అనే నగరానికి వేలాదిమంది అత్యవసర సిబ్బందిని బుధవారం అధికారులు పంపారు.
అనేక నదుల సంగమం వద్ద ఉన్న జువౌజో నగరానికి వరదనీరు రావడంతో ఈ నగరం తీవ్రంగా దెబ్బతిన్నదని స్థానిక మీడియా తెలిపింది. దీంతో రాజధాని పొరుగున ఉన్న హెబీ ప్రావిన్స్‌లోని లక్షలాది మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ వర్షాల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా అందరినీ బయటకు పంపించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్థానిక ప్రభుత్వాలకు ఆదేశించారు. వరద ఉధృతి తగ్గడంతో స్థానిక అధికారులు బుధవారం రెడ్ అలర్ట్ ఎత్తేయడంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.
1998లో చైనా అత్యంత ఘోరమైన వరదలను చవిచూసింది. యాంగ్జీ నది పొంగిపొర్లడం, ఈశాన్యంలోని ఇతర జలమార్గాల ఒడ్డున వరదలు రావడంతో దాదాపు నాలుగువేల మందికి పైగా మృతి చెందారు. ఈ వరదల వల్ల 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక 2021లో జెంగ్‌జౌ నగరం, హెనాన్ పరిసర ప్రావిన్స్‌లో వరదలు సంభవించినప్పుడు మూడు వందల మంది మృతి చెందారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు