ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు

ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు
కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై ఆంక్షలు విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. చట్టబద్ధమైన అనుమతి ఉన్నవారికే, అదికూడా పరిమిత సంఖ్యలో దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తామని పేర్కొంది.  ప్రభుత్వ నిర్ణయంతో దేశీయంగా కంప్యూటర్ల తయారీకి ఊతమందుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
హెచ్ఎస్ఎన్ 8741 కేటగిరీలోకి వచ్చే ల్యాప్ టాప్స్, ట్యాబ్స్, పీసీలను ఇకపై సరైన లైసెన్స్ లేకుండా దిగుమతి చేసుకోవడం కుదరదు. నిబంధనల మేర దిగుమతి చేసుకోవడానికి కూడా వ్యాలిడ్ లైసెన్స్ అవసరం అని కేంద్రం స్పష్టం చేసింది.  అయితే, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్, అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ ల దిగుమతికి ఈ ఆంక్షలు వర్తించవని వెల్లడించింది.
ఈ కామర్స్ పోర్టల్స్ నుంచి కొనుగోలు చేసిన వాటికి నిర్ధారిత పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే, బ్యాగేజీ నిబంధనల ప్రకారం తీసుకువస్తున్న వాటిపై కూడా ఈ ఆంక్షలు వర్తించబోవు.  ఒక కన్సైన్ మెంట్ లో 20 వరకు ఎలాంటి ఇంపోర్ట్ లైసెన్స్ లేకుండానే భారత్ కు తీసుకురావచ్చు. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, టెస్టింగ్, బెంచ్ మార్కింగ్ అండ్ ఎవాల్యుయేషన్, ప్రొడక్ట్ డెవలప్ మెంట్, రిపేర్ అండ్ రీ ఎక్స్ పోర్ట్.. తదితర అవసరాల కోసం ఇంపోర్ట్ చేసుకునే వాటికి కూడా ఈ ఆంక్షలు వర్తించవు. 
 
అయితే, వాటిని ముందు పేర్కొన్న అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వాటిని ఇతరులకు అమ్మకూడదు. అవసరం పూర్తయిన తర్వాత వాటిని నాశనం చేయాలి. లేదా, మళ్లీ ఎగుమతి చేయాలి. కాగా, ఏప్రిల్‌-జూన్‌ నెలల్లో ట్యాబ్‌లు కంప్యూటర్లతో సహా ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతులు 19.7 బిలియన్‌ డాలర్లకు చేరాయని పరిశ్రమ వరాలు తెలిపాయి. 
 
గతేడాదితో పోల్చితే ఇది 6.25 శాతం అధికమని చెప్పారు. దేశీయ మార్కెట్‌లో అసర్‌, శాంసంగ్‌, ఎల్జీ, పానాసోనిక్‌, ఆపిల్‌, లెనొవో, హెచ్‌పీ, డెల్‌ వంటి కంపెనీల ల్యాప్‌టాప్‌ల అధికంగా అమ్ముడవుతున్నాయి. వీటిలో ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అవుతుండటం గమనార్హం.