ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.54 వేల కోట్లు

ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.54 వేల కోట్లు
దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.54,545 కోట్లు ఉంటుందని ఏడీఆర్‌- నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు సంయుక్తంగా వెల్లడించాయి. 28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 4,033 మంది ఎమ్మెల్యేల్లో 4,001 మంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించి ఈ నిర్ధరణకు వచ్చినట్లు ఆ సంస్థలు తెలిపాయి. 
 
ప్రధాన రాజకీయ పార్టీల్లో 1,356 మంది బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.16,234 కోట్లు, 719 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 15,798 కోట్లు, ఆ తర్వాత 146 మంది వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.3,379 కోట్లు, 103 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.1,443 కోట్లు, 19 మంది టీడీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ.1,311 కోట్లు ఉంటుంది. 
 
అత్యధిక ఆస్తులు ఉన్న 10 పెద్ద పార్టీల్లో డీఎంకే, ఆప్‌, సమాజ్‌వాదీ, ఎన్సీపీ, జేడీఎస్ లు ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.11.97 కోట్లు కాగా, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ. 21.97 కోట్లు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.23.14 కోట్లు. డీఎంకే ఎమ్యెయేలా సగటు ఆస్తులు రూ. 12.69 కోట్లు కాగా, ఆప్ ఎమ్యెల్యేల సగటు ఆస్తులు రూ. 10.20 కోట్లుగా ఉన్నాయి.
 
దేశంలో ఎమ్మెల్యేల ఆస్తుల విలువ మొత్తం నాగాలాండ్‌, మిజోరాం, సిక్కింల బడ్జెట్‌కు మించి ఉంటుందని లెక్కతేలింది. మొత్తం 84 రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్ర సభ్యుల వివరాలను ఈ సంస్థలు అధ్యయనం చేశాయి. అన్ని రాష్ట్రాల్లో కంటే త్రిపురలోని 59 ఎమ్మెల్యేల ఆస్తులు చాలా తక్కువ. వారందరికి కలిపి రూ.90 కోట్ల మేరకే ఆస్తులు ఉంటాయి. 
 
రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక ఎమ్మెల్యేలు అత్యధిక ఆస్తులతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి. తెలంగాణ 8వ స్థానంలో ఉంది. కర్ణాటకలో 223 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.14,359 కోట్లు కాగా, తెలంగాణ 118 మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ రూ.1,601 కోట్లు.