8,9,10 తేదీల్లో అవిశ్వాస తీర్మానం

8,9,10 తేదీల్లో అవిశ్వాస తీర్మానం
మణిపూర్ విషయంలో కేంద్రం వైఫల్యాన్ని, మౌనాన్ని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై ఈ నెల 8, 9, 10 తేదీలలో లోక్ సభ చర్చింపనుంది.  కేంద్ర మంత్రిమండలిపై సభ విశ్వాసం కోల్పోయిందన్నకాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్ సభ సభాపతి ఓం బిర్లా గత నెల 26న అనుమతించిన సంగతి తెలిసిందే.
 
బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినా  ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎంపీల బలం ఉండటంతో కాంగ్రెస్ ఎంపీ ఇచ్చిన నోటీసును స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. విపక్షం ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చకు తేదీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు.
ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 10 వరకు సభలో చర్చ జరుగుతుంది.
ఆగస్ట్ 10న ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తారు. అనంతరం ఓటింగ్ జరుగుతుంది. విపక్షం జులై 26వ తేదీన మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ కు అందజేసింది.  లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మణిపూర్ సహా పలు అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను బలంగా వినిపించడానికి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ అవిశ్వాస తీర్మానంపై చర్చ సరైన వేదిక అని ప్రధాన విపక్ష కూటమి ‘ఇండియా’ భావిస్తోంది. 

మరోవైపు, విపక్షం తీరును ఎండగడ్తూ, ప్రభుత్వం సాధించిన విజయాలను ఏకరువు పెట్టడానికి ఈ చర్చను ఉపయోగించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. లోక్ సభలో విపక్ష, అధికార పక్ష బలాబలాలను పరిశీలిస్ అవిశ్వాస తీర్మానం నెగ్గే అవకాశాలు లేవని అర్థం అవుతుంది. 

సభలో అధికార పక్షమైన ఎన్డీయేలో ప్రధాన పార్టీ అయిన బీజేపీకే సొంతంగా మెజారిటీ ఉంది. దానికి తోడు ఎన్డీయే పక్షాల మద్ధతు ఉంది. అందువల్ల, ఈ తీర్మానం వీగిపోవడం లాంఛనమే. 543 మంది సభ్యులు ఉండే లోక్ సభలో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 331 మంది ఎంపీల బలం ఉంది. 

ప్రతిపక్ష ఇండియా కూటమికి 141 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రెండు పక్షాలకు చెందనివారు సుమారు 60 మంది ఉన్నారు.   అయితే, మండిపోతున్న మణిపూర్ సహా దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా మణిపూర్ లో కొనసాగుతున్న సంక్షోభంపై చర్చ జరుగుతుంది.

‘మణిపూర్ లో అరాచకం రాజ్యమేలుతోంది. ప్రభుత్వమనేదే లేదు. వర్గ పోరు, హింసతో రాష్ట్రం అట్టుడుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది..’ అని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఈ తీర్మానంపై స్పందిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్ల, బీజేపీ పట్ల ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో కూడా ప్రతిపక్షాలు ఇదే విధంగా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాయని, వారికి ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు.