
లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు బీహార్‌లో విలువైన భూములు తీసుకుని రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలపై సీబీఐ, ఈడీ ప్రస్తుతం విచారణ జరుపుతున్నాయి. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల కుంభకోణం చేటుచేసుకుందని దర్యాప్తు సంస్థల అభియోగంగా ఉంది.
యూపీఏ ప్రభుత్వం 2009లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణం వెలుగుచూసింది. దీంతో రైల్వే మంత్రి పదవిని లాలూ కోల్పోయారు. అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించారు. 2021లో తిరిగి ఈ కుంభకోణం పట్టాలెక్కింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం 2022లో లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమ యాదవ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ప్రతిభ ప్రాతిపదికగా కాకుండా ఆశ్రితపక్షపాతంపై లాలూ కార్యాలయం నియామకాలు జరిపినట్టు విచారణలో వెల్లడైంది. రైల్వే మంత్రిగా లాలూ అధికార దుర్వినియోగానికి తన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు లబ్ధి చేకూర్చారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నారు. 2004-2009 మధ్య పాట్నాకు చెందిన పలువురుని గ్రూప్-డి పోస్టుల్లో రిక్రూట్ చేశారని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.
ఈ పోస్టుల కోసం ఎలాంటి అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇవ్వలేదని, రిక్రూట్‌మెంట్ నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు జరిగాయని తెలిపింది. ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జైపూర్, హజీపూర్ వంటి వివిధ రైల్వే జోన్లలో అభ్యర్థుల నియామకాలు జరిగాయని పేర్కొంది. ఈ కుంభకోణం ద్వారా లక్ష చదరపు అడుగుల భూమిని కేవలం రూ.26 లక్షలకే లాలూ కుటుంబ సభ్యులు సేకరించారని, అయితే వీటి విలువ రూ.4.39 కోట్ల పైమాటేనని సీబీఐ ఆరోపిస్తోంది.
కాగా, ఈడీ సైతం ఈ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ, పాట్నా, ముంబై, రాంచీలోని 24 ప్రాంతాల్లో ఇంతకుముందు గాలింపు చర్యలు జరిపింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపించని కోటి రూపాయల నగదును, విదేశీ కరెన్సీ, బంగారు నగలు స్వాధీనం చేసుకుంది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు