‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచారంపై మోదీ శ్రీకారం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని అమరవీరులైన వీర యోధులకు సన్మానం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ‘మేరీ మాటి మేరా దేశ్’ ప్రచారాన్ని ప్రకటించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం103వ ఎపిసోడ్‌లో ఈ  కీలక ప్రకటన చేశారు. 
 మేరీ మాటి మేరా దేశ్ పేరుతో కొత్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌవించుకునేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘అమృత్ మోహత్సవ్’ ప్రతిచోటా ప్రతిధ్వనించడం, ఆగస్ట్ 15 సమీపంలో.. దేశంలో పెద్ద ప్రచారం ‘మేరీ మతి మేరా దేశ్’ ప్రారంభించబడుతుందని ఆయన తెలిపారు.
‘అమరవీరులకు గౌరవ సూచకంగా దేశంలోని వివిధ గ్రామాల్లో ప్రత్యేక శాసనాలను ఏర్పాటు చేస్తాం. దీంతోపాటు అమృత్ కలశ యాత్ర పేరుతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7500 కలశాల్లో మట్టి, మొక్కలను సేకరించి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్తూపం పక్కనే అమృత్ వాటిక పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మించనున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు.

 
ఏక భారత్ శ్రేష్ట్ భారత్‌కు ప్రతీకగా ఈ అమృత్ వాటిక నిలుస్తుందని ప్రధాని చెప్పారు. గత కొన్ని రోజులుగా దేశంలో వివిధ ప్రాంతాలలో వర్షాల కారణంగా, యమునా వంటి నదులు పొంగి ప్రవహించడంతో, కొండా చరియలు పడిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందుకు ఎదుర్కొన్నారని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. 
అయితే, ప్రజలు మరోసారి సమిష్టి కృషి ద్వారా ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని నిరూపించారని సంతోషం తెలిపారు.
అకాల వర్షాల కారణంగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడిన తీరును ప్రధాని అభినందించారు.  తన రేడియో ప్రసంగంలో, మోదీ గత కొన్నేళ్లుగా హజ్ విధానంలో ప్రభుత్వం చేసిన మార్పులను కూడా ప్రశంసించారు.
ఆధ్యాత్మిక, సంస్కృతిపరంగా శ్రావణమాసం మనకు ముఖ్యమైనదని అంటూ ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలు వార్షిక తీర్థయాత్రకు వెళ్ళే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు.  మన దేశంలోని పవిత్ర పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారని చెబుతూ ఇటీవల అమర్‌నాథ్ యాత్రలో ఇద్దరు అమెరికన్ మిత్రులు పాల్గొన్నట్లు తనకు తెలిసిందని పేర్కొన్నారు.  దీంతో ఆధ్యాత్మికతకు సరిహద్దులు లేవని మరోసారి స్పష్టమైందని తెలిపారు.  ఈ ఏడాది రికార్డు స్థాయిలో 10 కోట్ల మంది వారణాసి యాత్ర చేస్తున్నారని తెలిపారు.