కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలకు పెట్టింది పేరు. అనూహ్యంగా కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, దక్షిణాదిన ఉనికి చాటుకున్న కాంగ్రెస్ లో రెండున్నర నెలలకే కుమ్ములాటలు రచ్చకెక్కడం ఆందోళనకరంగా మారింది. మరో పది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలో విభేదాలు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన విభేదాలపై ఆ పార్టీ అధిష్ఠానం కేవలం చెందుతుంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు అధికారాన్ని చేపట్టి 75 రోజులైనా పూర్తికాలేదు. అప్పుడే ప్రభుత్వంలో అస్థిరత మొదలైంది. సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే అవినీతి ఆరోపణలు వెలువడటం కాంగ్రెస్‌ను కకావికలం చేస్తున్నది. పార్టీలో అసమ్మతి, అంతర్గత కుమ్ములాటలు రాష్ట్ర సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నది.
సమస్యలను పరిష్కరించడంలో భాగంగా గురువారం సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశాన్ని నిర్వహించినా ఫలితం దక్కలేదు. దీంతో ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలతో వచ్చే నెల 2న ఢిల్లీలో రెండు కీలక సమావేశాలను నిర్వహించనున్నది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ భేటీలు జరుగనున్నాయి. సమస్యల పరిష్కారానికి ఓ సమన్వయ కమిటీని ఈ భేటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, పార్టీ మధ్య వారధిగా ఈ కమిటీ పనిచేయనున్నట్టు సమాచారం. పార్టీలో అసమ్మతి, ప్రభుత్వ పటిష్టత, సర్కారు విధానాల అమలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై కూడా కమిటీ దృష్టిసారించనున్నట్టు తెలుస్తున్నది. మంత్రులు తమకు అందుబాటులో ఉండటంలేదంటూ ఇటీవల కొందరు శాసనసభ సభ్యులు ఆరోపించారు.
దీనిపై కూడా భేటీలో మాట్లాడే అవకాశమున్నదని, కీలక నిర్ణయాల్లో సభ్యుల అభిప్రాయాలను తీసుకోవాల్సిందిగా అధిష్ఠానం మంత్రులకు సూచించనున్నట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతోపాటు కీలక మంత్రులు, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్, ఆర్‌వీ దేశ్‌పాండే, బీఎల్ శంకర్‌లను ఢిల్లీకి రావాలని ఆదేశించింది.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునుంచే హస్తం పార్టీలో ఆధిపత్యపోరు మొదలైంది. సీఎం పీఠం ఎవరన్నదానిపై అధిష్ఠానం నిర్ణయం కోసం అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ హస్తిన చుట్టూ తిరిగారు. సీఎంగా సిద్ధరామయ్యను ప్రకటించడాన్ని శివకుమార్ పైకి స్వాగతించినప్పటికీ, లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారు.
పరిపాలనలో అధిపత్య ప్రదర్శన కోసం శివకుమార్ తెర వెనుక తతంగాల్లో మునిగిపోతున్నారు. మంత్రివర్గం కూడా రెండుగా చీలిపోయినట్లు వ్యవహరించడం సర్కారులో కుదుపునకు కారణమైంది. అసలే అంతర్గత కుమ్ములాటలతో కుదేలైన ప్రభుత్వంపై స్వపక్ష ఎమ్మెల్యేలే అవినీతి ఆరోపణలు చేయడం, మంత్రుల వైఖరిని తప్పుబట్టడం సర్కారు అస్థిరతకు దారితీసింది.
More Stories
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ మంత్రివర్గం విజయం
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం