ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం

కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. గురువారం అర్ధరాత్రి నుండి క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న వరద ప్రవాహం శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతానికి 2 లక్షల 70 వేల క్యూసెక్కులకు చేరుకుంది.  బ్యారేజి పూర్తిస్థాయి నీటిమట్టం 12 అడుగుల చేరిన నేపథ్యంలో 30 గేట్లను 7 అడుగుల మేర, 40 గేట్లను 6 అడుగుల మేర ఎత్తి దిగువకు వరద నీటిని మళ్ళిస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 2 లక్షల 70 వేల క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2 లక్షల 60 వేల క్యూసెక్కులుగా ఉంది.
 
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ సాగరంలో కలిసేందుకు పరవళ్ల తొక్కుతూ ప్రవహిస్తున్న తీరు సందర్శకులను తన్మయత్వానికి గురిచేస్తుంది. మ్యారేజి వద్ద పూర్తిస్థాయిలో 70 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని మళ్ళిస్తున్న నేపథ్యంలో వాటిని తిలకించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున బ్యారేజీ వద్దకు తరలివస్తున్నారు.
 
బీరబరా పారుతున్న కృష్ణమ్మను చూసి తమ సెల్ఫోన్లో బంధించేందుకు సందర్శకులు ఉత్సాహపడుతున్నారు. బ్యారేజీ పైనుండి కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తూ సెల్ఫీలను గ్రూప్ ఫోటోలను పెద్ద ఎత్తున సందర్శకులు తీసుకుంటున్నారు. మ్యారేజి వద్ద సందర్శకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు గట్టి నిగాను ఏర్పాటు చేశారు.
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తాంధ్రలో కేంద్రీకృతమై ఉందని దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని వాతావరణశాఖ పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
 
గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద శనివారం కూడా పెరిగి ఆదివారం నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి డా.బిఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు.  ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 13 లక్షల క్యూసెక్కులు ఉందని రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. సహాయక చర్యల్లో 4ఎన్డీఆర్‌ఎఫ్‌, 4 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయని చెప్పార
 
కృష్ణా, గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీచేశామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా లొతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదల పట్ల అత్యవసర సహాయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు 1070, 1800 425 0101 సంప్రదించాలని సూచించారు.