ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌‌గా బాధ్యతలు చేపట్టిన ధీరజ్‌ సింగ్‌

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌‌గా బాధ్యతలు చేపట్టిన ధీరజ్‌ సింగ్‌
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్ ఠాకూర్‌  బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 24న ఠాకూర్‌ నియామకానికి రాష్ట్ర పతి అమోదముద్ర వేశారు. బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కొలిజియం సిఫార్సు చేయడంతో ఈనెల 24న రాష్ట్రపతి అమోద ముద్ర వేశారు.

శుక్రవారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ చీఫ్‌ జస్టిస్‌ చేత ప్రమాణం చేయించారు. అనంతరం సీజేగా ధీరజ్‌ సింగ్ ఠాకూర్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 

ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను గవర్నర్‌, సిఎం పుష్పగుచ్చాలతో సత్కరించారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ పదోన్నతిపై సీజేగా ఏపీ హైకోర్టుకు వచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకుర్‌‌ను నియమిస్తూ సుప్రీం కోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. 

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొద్ది నెలల క్రితం పదోన్నతి లభించింది. దీంతో కొత్త సీజేఐ నియామకానికి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ పేరును సిఫార్సు చేస్తూ జులై 5వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.