సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు ఈడీ డైరెక్టర్ గా ఎస్‌కే మిశ్రా

సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు ఈడీ డైరెక్టర్ గా ఎస్‌కే మిశ్రా
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ డైరెక్ట‌ర్‌గా సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు సంజ‌య్ కుమార్‌ మిశ్రా కొన‌సాగ‌నున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఆయ‌న్ను కొన‌సాగిచేందుకు అనుమ‌తి ఇచ్చింది. అయితే ఆ త‌ర్వాత ఎటువంటి పొడిగింపు ఉండ‌ద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. 
 
జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, విక్ర‌మ్‌నాథ్‌, సంజ‌య్ క‌రోల్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. ఎస్‌కే మిశ్రా ప‌ద‌వీకాలాన్ని పొడిగించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం సుప్రీంలో పిటీష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. సంజయ్ మిశ్రా పదవీ కాలం జులై 31తో ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 
 
తాజా పిటిషన్ ను పరిశీలించాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంను కోరారు. దీంతో తాజా పిటిషన్ ను విచారించేందుకు జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆ పిటీష‌న్‌ను సుప్రీం బెంచ్ విచారించింది. 2018 నవంబర్ లో సంజయ్ కుమార్ మిశ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాధ్యతలు చేపట్టారు.
రెండేళ్ల తర్వాత ఆయనకు 60 ఏళ్లు రావడంతో పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. అయితే, నవంబర్ 2020 లో ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల నుంచి మూడేళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులను సవరించింది.  అనంతరం 2022లోనూ మూడోసారి ఆయన పదవీ కాలాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని సవాల్ చేస్తూ పలువురు నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.