రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తేవడంకు విముఖత

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. అయితే, కేంద్ర సమాచార కమిషన్ (సిఇసి) ఆదేశాలను సుప్రీంకోర్టులో రిట్‌ను కోరేందుకు ఉపయోగించలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ‘రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావడానికి మాండమస్ (అధికారిక విధులను నిర్వహించడానికి ప్రభుత్వానికి న్యాయపరమైన ఆదేశాలు) కోరడానికి సీఐసీ ఉత్తర్వు ఉపయోగించబడదు’ అని కోర్టుకు తెలిపారు.

అయితే, రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి వచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తే రాజకీయాలకు సంబంధించిన అత్యంత గోప్యమైన అంశాలను కూడా వెల్లడించాల్సి వస్తుందని, దాంతో తమ పార్టీల మనుగడకు, రాజకీయానికి ప్రమాదం వస్తుందని పార్టీలు భావిస్తున్నాయి.

పార్టీకి అందే విరాళాలు, నిధుల సేకరణ, ఎన్నికల ఖర్చుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేస్తున్నామని, ఇదే సమాచారాన్ని అడిగితే ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పలు పార్టీలు పేర్కొంటున్నాయి. పార్టీలు చేసే రాజ‌కీయాల‌ను ఇత‌ర వ్యక్తులతో పంచుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నాయి.

మరోవైపు ఆర్థిక అంశాలకు సంబంధించి ఆర్టీఐపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీపీఎం తరఫున న్యాయవాది పీవీ దినేష్‌ తెలిపారు. అయితే, అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేశారో మాత్రం చెప్పడం సాధ్యం కాదని చెప్పారు. అది పార్టీ అంతర్గత నిర్ణయాల ప్రక్రియకు సంబంధించిన విషమని స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలో పారదర్శకత ఉండేలా ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులు, భూములు పొందడం తదితర ప్రయోజనాలను పొందుతున్న రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని 2013లో సీఐసీ ఉత్తర్వులు జారీ చేసిందని ఎన్జీవో తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు.

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ వేర్వేరుగా దాఖలు చేసిన ఈ పిటిషన్లపై విచారణను ఆగస్టు ఒకటో తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే, అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి కేసు వ్యవహారాలను చూసుకుంటున్నారని, ఆయన అందుబాటులో లేరని సొలిసిటర్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకురాగా, పరిగణలోకి తీసుకుంటూ వాయిదా వేసింది.