
గత రెండున్నర నెలలుగా హింస, అల్లర్లతో హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మహిళల పట్ల దారుణమైన అపచారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, అనంతరం వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం దేశ ప్రజలకే సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను మరో వర్గానికి చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు గురువారం పోలీసులు వెల్లడించారు. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇది సిగ్గుమాలిన చర్య అని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఏ నాగరిక సమాజం కూడా ఇటువంటి దుశ్చర్యను అనుమతించబోదని స్పష్టం చేశారు. ఈ సంఘటనతో తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని చెబుతూ మొత్తం 140 కోట్ల భారతీయలను ఈ ఘటన అవమానంతో తలదించుకొనేతలంటూ చేసిందని ప్రధాని తెలిపారు.
నిందితులు ఎవ్వరిని వదిలే ప్రసక్తి లేదని భారత ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఏ నిందితుడినీ వదిలిపెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైనవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు.
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని శాంతిభద్రతల పరిస్థితులను పటిష్టం కావించాలని ప్రధాని ముఖ్యమంత్రులు అందరికి విజ్ఞప్తి చేశారు. మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. దేశంలో ఎక్కడ ఎటువంటి ఘటన జరిగిన రాజకీయాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
మే 4న ఈ హేయమైన సంఘటన జరిగినట్లు ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ఐటీఎల్‌ఎఫ్) ఆరోపించింది. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా నడిపిస్తుండడంతో పాటు వారిని కొడుతూ, దూషిస్తూ ఉండడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తమను వదిలేయాలని ఆ అసహాయ మహిళలు ఏడుస్తూ, వేడుకుంటున్నా ఆ రాక్షసులు కనికరించలేదు.
మహిళలను నగ్నంగా నడిపించడానికి సంబంధించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అపహరణ, సామూహిక అత్యాచారం తదితర నేరారోపణల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశామని, ఇతర నిందితులను కూడా అతి త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. వారిని పట్టుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు.
ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ విచారణకు ఆదేశించారు. అటు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ సంఘటనపై స్పందిస్తూ, తాను అమానుషమైన, దిగ్భ్రాంతికరమైన వీడియోను చూశానని, వెంటనే మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్‌తో మాట్లాడానని చెప్పారు.
ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో మణిపూర్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బాధిత మహిళలకు చెందిన వర్గం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతోంది.
ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నందువల్ల ఈ వీడియోను తొలగించాలని ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. భారత దేశంలో కార్యకలాపాలను నిర్వహించే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ దేశంలో అమలవుతున్న చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
నవంబర్ 5 నుంచి 15 వరకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు!
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా